స్పాండిలోసిస్‌ అంటే ఏంటో తెలుసా?

10 Mar, 2021 21:17 IST|Sakshi

స్పాండిలోసిస్‌ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. నిజానికి ఇది కూడా ఒక రకమైన ఆర్థరైటిస్‌. మెడ భాగంలో వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అని, నడుము భాగంలో వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అంటారు. స్పాండిలోసిస్‌కు కారణాలేమిటో చూద్దాం. కాళ్లు, చేతులతో ఉన్నట్లు వెన్నులో కూడా కీళ్లు  (జాయింట్స్‌) ఉంటాయి. ఈ జాయింట్స్‌ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. స్పైన్‌ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు. వెన్నుపూసల మధ్య నుంచి నరాలు శరీరంలో చాలా నరాలు వ్యాపించి ఉంటాయి. వెన్నుపూసల మధ్య నుంచి నరాలు వచ్చే ఆ మార్గం మరీ ఎక్కువగా సన్నబడినప్పుడు ఆ పూసలు నరాలను నొక్కేస్తాయి. దాంతో నరాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. 

సర్వైకల్‌ స్పాండిలోసిస్‌లో మెడనొప్పితో పాటు తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు పాకుతున్నట్టుగా వస్తుంది. లంబార్‌ స్పాండిలోసిస్‌లో నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితోపాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు.

నివారణ కోసం ఫిజియోథెరపిస్టులను సంప్రదించి వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. అలాగే మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్‌ ఎక్కువ గా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వంటి ఆహార పరమైన జాగ్రత్తలు పాటించాలి. కూర్చోవడం లేదా నిల్చోవడంలో సరైన భంగిమలు (పోష్చర్స్‌) పాటించాలి. డాక్టర్లను సంప్రదించి అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది.

చదవండి: నాటు కోడి గుడ్లను ఎక్కువ ధర పెట్టి కొంటున్నారా?

మరిన్ని వార్తలు