Uravashi Singh: తమ్ముడిలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదని..

16 Jun, 2022 09:51 IST|Sakshi

బ్రెయిన్‌ డెడ్‌ అయి చనిపోయిన వారి అవయవాలు దానం చేయడం వల్ల నలుగురైదుగురి ప్రాణాలు నిలబడటం అనేక సందర్భాల్లో చూస్తున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో అలా అవయవ దానం చేయడం కుదరదు. తమ్ముడి విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఊర్వశి సింగ్‌.. తన తమ్ముడిలా మరెవరూ ప్రాణాలు కోల్పోకూడదని ‘బ్లడ్‌లైన్‌’ను నడుపుతూ వేలమంది ప్రాణాలు కాపాడుతోంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఊర్వశి సింగ్‌కు ఇద్దరు చెల్లెళ్లతోపాటు ఒక్కగానొక్క తమ్ముడు అతుల్‌ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ్ముడిని ఎంతో ముద్దుగా చూసుకునేవారు. అది  2009... అతుల్‌కు లక్నోలో కొత్త ఉద్యోగం దొరికింది. ఆ విషయం అమ్మకు చెప్పడానికి జాన్పూర్‌ వస్తున్నాడు. ఆరోజు మదర్స్‌ డే కావడంతో అమ్మకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలన్న ఆత్రుతలో ఉన్నాడు.

ఇంతలో వెనకనుంచి వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో యాక్సిడెంట్‌ అయ్యి తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గర్లో ఉన్నవారు ఆసుపత్రిలో చేర్చడంతో తమ్ముడికోసం ఎదురుచూస్తోన్న ఇంట్లో వాళ్లకు ఈ దుర్ఘటన గురించి తెలిసింది. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. కానీ తీవ్రంగా గాయపడడంతో ఎక్కువ మొత్తంలో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి. అతుల్‌ స్నేహితుల సాయంతో కొంతవరకు రక్తం ఏర్పాటు చేసినప్పటికీ, కావాల్సినంత రక్తం సమయానికి అందకపోవడంతో తమ్ముడు చనిపోయాడు. 

బ్లడ్‌లైన్‌...
సరైన సమయానికి రక్తం దొరికి ఉంటే తమ్ముడు బతికి ఉండేవాడు. అనిపించింది ఊర్వశికి. అప్పుడు తన తమ్ముడిలా ...రక్తం దొరకక, సరైన వైద్యం అందక ఎవరూ ప్రాణాలు కోల్పోకూడదు అని సంకల్పించుకుంది. దాంతో ‘బ్లడ్‌లైన్‌’ పేరుతో రక్తదాన బ్యాంకును ఏర్పాటు చేసి అప్పటినుంచి ఆపద, అత్యవసర వైద్యసదుపాయం అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేయడం ప్రారంభించింది. స్నేహితులు, బంధువుల సాయంతో కొన్నేళ్లు చేశాక.. ఒక్కదానివల్ల ఎక్కువ మందికి సాయం అందించలేకపోతున్నాను అనుకుని... 2018లో సామాజిక సేవాకార్యక్రమాలు చేసే కర్నిసేనతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న అధికారులను సమన్వయపరుస్తూ ఎక్కడ ఏ రోగికి అవసరమున్నా వెంటనే స్పందించి సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ సంస్థతో కలిసి ఊర్వశికూడా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తోంది.

అతుల్‌ ట్రస్ట్‌..
తమ్ముడి పేరుమీద ‘అతుల్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’ను ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలోని వారికి సైతం కాలేజీ విద్యార్థుల సాయంతో అత్యవసరంలో ఉన్నవారికి రక్తం అందిస్తోంది. సోషల్‌ మీడియాలో వివిధ ప్రచార కార్యక్రమాలు ద్వారా ఊర్వశి తన సేవలకు కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి, కోవిడ్‌ సమయంలో కూడా అనేకమంది ప్రాణాలను కాపాడింది.

నేను పేషెంటుని అయినప్పటికీ...
‘‘ఎక్కువమందికి సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో అడిగిన వారందరికి రక్తం సరఫరా చేస్తున్నాము. కొన్నిసార్లు అర్ధరాత్రి, తెల్లవారు జామున మూడు గంటలకు కూడా రక్తం కావాలని ఫోన్‌లు వస్తుంటాయి. అలాంటి సమయంలో మా కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఫోన్‌ మాట్లాడి వాళ్ల అవసరాలు తీరుస్తున్నాను. నాకు ఆస్తమా ఉండడం వల్ల ఇంట్లో వాళ్లు నేను రక్తం దానం చేయడానికి ఒప్పుకోరు. అయినప్పటికీ ఈ మధ్యనే ఢిల్లీలో ఎయిమ్స్‌ ఆస్పత్రిలోని ఓ గర్భిణికి రక్తదానం చేసి ఆమె ప్రాణాలు కాపాడాను. బ్లడ్‌బ్యాంక్‌లు అనుసరిస్తోన్న కొన్ని నిబంధనల వల్ల ప్రతి మూడునెలలకు చాలా రక్తం పాడై, వృధాగా పోతుంది. ఆ నిబంధనలు కాస్త సడలించడం వల్ల అవసరంలో ఉన్న వారికి రక్తం అందుతుంది’’ అని ఊర్వశి ప్రభుత్వాలను కోరుతోంది. 

మరిన్ని వార్తలు