ఆపదొస్తే అణుబాంబై పేలడం తెలీదా?

4 Apr, 2021 11:23 IST|Sakshi

సాహిత్యం

ఒప్పందం
నాకు సమ్మతమే
నువ్వు మాలవై ఉంటానంటే
అందులో
నేను
పువ్వై ఉండటమే కాదు

నువ్వు
ఎడారివై ఉంటానంటే
అందులో
నేను
ఇసుకై ఉండేందుకు ...

నిరీక్షణ
నీకోసం నిరీక్షిస్తున్నాను
ప్రతి నిముషమూ
నాపై
అగ్గిరవ్వ అణువణువూ తాకగా
నీకోసం నిరీక్షిస్తున్నాను
అది
ఒక సుఖ నరకం
నీకోసం తీసుకొచ్చాను
ఒకే ఒక్క గులాబీ
అయిదు నిముషాలకు ఓ రేకు చొప్పున
తుంచి తుంచి
కింద పడేస్తున్నాను
ఒకటీ
రెండూ.... మూడూ...
మంచివేళ
ఆఖరి రేకు తుంచేందుకు
చేతులు వణకగా
దూరాన
వర్ణచుక్కలై
నువ్వు
రావడం కనిపించింది
లేకుంటే
నా హదయ గులాబీలోనూ
తొడిమే మిగిలేది

నడపండి
మీ వేదిక
మీ నాలుక
ఏదైనా మాట్లాడండి

మీ పెన్నూ
మీ ముద్రణ
ఏదైనా రాయండి

మీ త్రాసు
మీ తూనిక రాళ్ళు
ఏదైనా విమర్శించండి

మీ గోడలు
మీ కాగితం
ఏదైనా అంటించండి

మీ వాయిద్యం
మీ కచ్చేరీ
ఏదైనా వాయించండి

మీ కుంచె
మీ వర్ణం
ఏదైనా గీయండి

కానీ
రేపు
కాలం విమర్శ
మీ శవాలను సైతం
తవ్వి తీసి
ఉరి వేస్తుంది
అనేది మాత్రం
జ్ఞాపకం
ఉంచుకోండి

తమిళ మూలం : కవి వైరముత్తు
అనుసజన : యామిజాల జగదీశ్‌

పూలకత్తులు
సేద్యపు మడులలో స్వేదనదులై ప్రవహించే వాళ్లకు
కాంక్రీట్‌ కట్టడాల్ని వరదై ముంచెత్తడం తెలీదా?
అవనికి అమ్మతనం కమ్మదనం రుచి చూపించేవాళ్లకు
దేశం ఆకుపై పాకుతున్న స్వార్థం పురుగుల్ని సంహరించడం తెలీదా?
నాగరికతకు నడకలు నేర్పి
అందరి కంచాలలో అన్నం మెతుకులై మెరిసే వాళ్లకు
ఆపదొస్తే అణుబాంబై పేలడం తెలీదా?
కార్పొరేట్‌ కళ్లద్దాలను తొడుక్కుని
కమతాలకు ఖరీదు కడతామంటే
కాలం కొండ మీద ఎర్రజెండాౖయె ఎగరటం
చలిచీమల్లాంటి ఆ శ్రమజీవులకు వెన్నతో పెట్టిన విద్య!
వాళ్లిప్పుడు...
ఆకలి చెట్లకి పూసిన పూలకత్తులు
చీకటి మెట్లను చీల్చుతున్న వెలుగు సుత్తులు
ఆ భూమిపుత్రుల్ని ముందుకు నడిపిస్తున్నది...
టెర్రరిస్టులో, క్యాపిటలిస్టులో కాదు,
అస్తిత్వం కోసం ఆరాటపడుతున్న ఆవేదన పిడికిళ్లు
బానిసత్వ శృంఖలాల్ని బద్దలు కొడుతున్న చైతన్యపాదాలు
(సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న మహా పోరాటానికి మద్దతుగా...)
-మామిడిశెట్టి శ్రీనివాసరావ

 మేలిపద్యం
మతి తప్పిన ప్రభువులతో
సతమతమయిపోయి జనులు ఛస్తావుంటే
గతి తప్పి వచ్చి రుతువులు
వెత పెడితే యెటుల మనవి ‘వెదరు’ గరీబూ!

(దేవీప్రియ ‘గరీబు గీతాలు’ నుంచి)

పోలీసులు మిత్రులనే
వ్రేలాడే బోర్డు చూసి వింతగ జనముల్‌
ఈలాంటి జోకులేలని
వ్రేలేసుక ముక్కుమీద వెళ్లిరి సుమనా!

(ఎన్‌.ఆర్‌.వెంకటేశం ‘కందాల మకరందాలు’ నుంచి)

కుమిలి క్రుళ్లుచు నిరుపేద గుడిసెలెల్ల
నేడు కంపుకొట్టుచునుండు నిజము కాని
అద్యతన నాగరిక హృదయాలకంటె
ఎంత పరిశుభ్రమైనవో ఎంచి చూడు

(డా. నండూరి రామకృష్ణమాచార్యులు ‘తారాతోరణం’ నుంచి)

మరిన్ని వార్తలు