పెళ్లయిన ఎన్నాళ్లకు గర్భం రావడం సాధారణం?

5 Sep, 2021 15:00 IST|Sakshi

సందేహం

నా వయసు 30 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. గత నాలుగు నెలలుగా నాకు పీరియడ్స్‌లో బ్లీడింగ్‌ చాలా ఎక్కువగా అవుతోంది. పొత్తికడుపులో నొప్పిగా ఉంటోంది. ఆ సమయంలో చాలా చిరాకుగా ఉంటోంది. రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.
– ప్రమీల, మచిలీపట్నం

పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపులో నొప్పితో పాటు బ్లీడింగ్‌ ఎక్కువగా అవడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఫైబ్రాయిడ్‌ గడ్డలు, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, అండాశయంలో కంతులు, ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల ఈ లక్షణాలు కనిపించవచ్చు. సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి గైనకాలజిస్టును సంప్రదించి, అల్ట్రాసౌండ్‌ పెల్విక్‌ స్కానింగ్‌ సహా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. కారణాలను బట్టి మందులతో చికిత్స సరిపోతుందా లేదా ఆపరేషన్‌ ద్వారా చికిత్స చేయాలా అనే విషయాలను డాక్టర్‌ మీతో చర్చించడం జరుగుతుంది.

ఈ లోపల మూడు నాలుగు రోజులు అధిక బ్లీడింగ్, నొప్పి నుంచి కొంచెం ఉపశమనం పొందడానికి ట్రైనక్సమిక్‌ యాసిడ్, మెఫినమిక్‌ యాసిడ్‌ కాంబినేషన్‌లో ఉన్న మాత్రలు రోజుకు రెండు లేదా మూడు చొప్పున రెండు మూడు రోజులు వేసుకోవచ్చు. అలాగే యోగా, మెడిటేషన్, వాకింగ్‌ వంటి వ్యాయామాలు చేయడం, మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవడం వల్ల కూడా ఈ లక్షణాల తీవ్రత నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు.

నా వయసు 52 ఏళ్లు. ఎడమ రొమ్ములో నొప్పిగా అనిపించడంతో డాక్టర్‌ దగ్గరకు వెళ్లాను. డాక్టర్‌ సలహాపై మామోగ్రాఫ్‌ పరీక్ష చేయించుకుంటే, బ్రెస్ట్‌ కేన్సర్‌ ఉందని, ఆపరేషన్‌ చేయించుకోవాలని చెప్పారు. కేన్సర్‌ అంటే భయంగా ఉంది. ఆపరేషన్‌ వల్ల ప్రాణాపాయం తొలగిపోతుందా?
– సువర్చల, ఆదోని

ఇప్పటి ఆధునిక కాలంలో క్యాన్సర్‌ను జయించడానికి అనేక రకాల అధునాతన యంత్రాంగం, మందులు, స్పెషలిస్టుల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఈమధ్య కాలంలో అనేక కారణాల వల్ల, ముఖ్యంగా మారుతున్న జీవనశైలి కారణంగా క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. మీకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అని నిర్ధారణ అయింది కాబట్టి, మొదట ఆపరేషన్‌ ద్వారా ఆ క్యాన్సర్‌ గడ్డను తొలగించి, దానిని బయాప్సీ పరీక్షకు పంపితే అది ఎలాంటి క్యాన్సర్, ఏ స్టేజిలో ఉంది, ఎంత పరిమాణం చుట్టూ వ్యాప్తిచెంది ఉంది, తర్వాతి కాలంలో తిరగబెట్టకుండా ఉండటానికి కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలేవైనా తీసుకోవాలా అనే అంశాలు తెలుస్తాయి. బయాప్సీ రిపోర్టు బట్టి అది మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఎంత శాతం మేరకు ఉన్నాయో కూడా తెలుస్తాయి.

దానిబట్టి ఆపరేషన్‌ తర్వాత డాక్టర్‌ దగ్గరకు మళ్లీ చెకప్‌లకు ఎంతకాలానికి ఒకసారి వెళ్లాలి, మళ్లీ మామోగ్రఫీ వంటి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి వంటి విషయాలను క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌ వివరించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అధైర్యపడకుండా ఆపరేషన్‌ చేయించుకోండి. తర్వాత డాక్టర్‌ చెప్పిన ప్రకారం క్రమంగా చెకప్‌లకు వెళుతూ, సరైన పరీక్షలు చేయించుకుంటూ వారి పర్యవేక్షణలో ఉంటే ఎక్కువకాలం ప్రాణాపాయం లేకుండా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ క్యాన్సర్‌ ప్రారంభ దశలోనే ఉండి, చుట్టుపక్కల విస్తరించకుండా ఉండి, తక్కువ తీవ్రత ఉన్న రకం అయితే ఆపరేషన్‌ తర్వాత ఏ సమస్యా ఉండదు.

మీరు భయపడుతూ ఆపరేషన్‌ చేయించుకోకుండా ఆలస్యం చేస్తూ ఉంటే క్యాన్సర్‌ మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాంతో సమస్యలు ఇంకా పెరిగి, ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి గాని, భయపడుతూ ఉంటే అది ఇంకా పెద్దదవుతుంది. ఇప్పటికాలంలో ప్రాణాపాయం ఎవరికైనా ఏదో ఒక సమస్య తెలిసీ తెలియక ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి భయపడకుండా ఆపరేషన్‌ చేయించుకోండి. ఉన్నంతకాలం సంతోషంగా జీవితం గడపండి.

నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.2,  అడుగులు, బరువు 46 కిలోలు. ఏడాది కిందట పెళ్లయింది. ఇంతవరకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. ఏడాదైనా నెలతప్పకపోవడంపై మా అత్తవారింట్లో విపరీతంగా ఒత్తిడి తెస్తున్నారు. పెళ్లయిన ఎన్నాళ్లకు గర్భం రావడం సాధారణం? 
– వందన, జగిత్యాల

ఎత్తు 5.2 అడుగులకు కనీసం 49 కిలోల బరువు ఉండాలి. నువ్వు కేవలం 46 కిలోలే ఉన్నావు. ఉండాల్సిన దానికన్నా బరువు తక్కువ ఉన్నవారిలో రక్తహీనత, పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి గర్భం రావడానికి ఆలస్యం కావచ్చు. నీకు పీరియడ్స్‌ సక్రమంగా వస్తున్నాయా లేదా అనేది రాయలేదు. సాధారణంగా భార్యాభార్తల్లో ఏ సమస్యా లేకుండా ఉంటే 80 శాతం మంది ఒక ఏడాదిలోనే గర్భం ధరించడం జరుగుతుంది. మిగిలిన 20 శాతం మందిలో 10–15 శాతం మందికి రెండేళ్లు పడుతుంది. దాదాపు 5–10 శాతం మందికి కొన్ని సమస్యలు ఉండి, గర్భధారణ కోసం చికిత్స అవసరం పడుతుంది. నీ వయసు 23 సంవత్సరాలే కాబట్టి, ఒత్తిడికి గురికాకుండా, మంచి పౌష్టికాహారం తీసుకుంటూ, గర్భంకోసం ప్రయత్నిస్తూ, ఇంకో సంవత్సరం ఆగి చూడవచ్చు.

ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే, ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, భార్యాభర్తలిద్దరిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి భర్తకు వీర్యపరీక్ష, నీకు అండం విడుదల సక్రమంగా అవుతుందా లేదా, అవుతుంటే ఏ రోజుల్లో అవుతోందో తెలుసుకోవడానికి ఫాలిక్యులర్‌ స్టడీ స్కానింగ్‌ చేయించుకోవాలి. ఇందులో గర్భాశయంలో, అండాశయంలో సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చు. అలాగే థైరాయిడ్‌ సమస్యలు ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి అవసరమైన సీబీపీ, ఎస్‌ఆర్‌. టీఎస్‌హెచ్‌ వంటి రక్తపరీక్షలు చేయించుకుని, సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు.

పరీక్షలలో సమస్యలేవీ లేకపోతే ఇంకో సంవత్సరం పాటు అండం విడుదలయ్యే రోజుల్లో తప్పకుండా కలయికలో పాల్గొంటూ గర్భం కోసం వేచి చూడవచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు అన్న తర్వాత వాళ్ల ఆతృత కొద్ది ఏదో ఒకటి అంటుంటారు. అవన్నీ పట్టించుకుని మనసు పాడు చేసుకోకుండా, భర్తతో ఆనందంగా ఉంటే, సమస్య ఏదీ లేకపోతే గర్భం అదే వస్తుంది. మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురైతే, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, గర్భం రావడం ఇంకా ఆలస్యమవుతుంది.

డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్‌
హైదరాబాద్‌

మరిన్ని వార్తలు