Expensive Watermelon: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయ.. ఏందుకంత స్పెషల్‌?

8 Jul, 2023 16:05 IST|Sakshi

పుచ్చకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో 95 శాతం నీరు ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్‌ నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా పుచ్చకాయను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్‌ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు.

రక్తప్రసరణను మెరుగుపరిచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పదిల పరిచే పుచ్చకాయను ఏ సీజన్‌లో అయినా తినేందుకు ఇష్టపడతారు. కానీ ఓ పుచ్చకాయ ధర 5లక్షల రూపాయలంటే నమ్మగలరా? జపాన్‌లో పండే ఈ అరుదైన పుచ్చకాయ అక్కడ చాలా ఫేమస్‌. ఎందుకంత కాస్ట్‌లీ? అసలు ఏంటీ దాని స్పెషాలిటీ ఇప్పుడు చూద్దాం. 


జపాన్‌ దేశంలో అత్యంత ఖరీదైన పండ్లను పండిస్తారు. వాటిలో ఒకటి డెన్సుకే పుచ్చకాయ. దీన్ని పండించేందుకు అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తారు. ఈ పుచ్చకాయల్ని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ప్రతీ పుచ్చకాయ బరువు దాదాపు 6 నుంచి 7 కేజీల దాకా ఉంటుంది. అంతేకాకుండా దీని రుచి కూడా చాలా బాగుంటుందంట. తియ్యగా కరకరలాడుతూ, రవ్వ రవ్వగా ఉంటుంది.

ఏడాది మొత్తంలో కేవలం 100 డెన్సుకే పుచ్చకాయలు మాత్రమే పండుతాయి. పైగా ఇవి సాధాసీదా మార్కెట్లలో లభించవు. వీటిని ప్రత్యేకంగా వేలం పాట ద్వారా విక్రయిస్తారు. దీన్ని జీవితంలో ఒక్కసారైనా రుచి చూడాలనే పట్టుదలతో ఉండేవారు ఈ వేలం పాటలో పాల్గొంటారు. ఈ పుచ్చకాయ ధర ప్రతి ఏటా పెరుగుతుంది. ప్రస్తుతం దీని ధర మార్కెట్‌లో సుమారు రూ. 5 లక్షలు ఉంది.

మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ పుచ్చకాయలను తినడానికి కొనరంట..ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి ఎక్కువగా కొనుగోలు చేస్తారట. అయినా అంద ధర పెట్టి పుచ్చకాయ కొనడం, తినడం రెండూ విడ్డూరమే కదూ..

మరిన్ని వార్తలు