స్క్రాప్‌బుక్‌లో ఎన్నెన్నో భావాలు

3 Oct, 2020 08:11 IST|Sakshi

‘మిస్‌ యూ!’ మిస్సైన ఫీల్‌ ఏదిరా.. ఎక్కడా?! ‘లవ్‌ యూ!’ దేవుడా రొటీన్‌. చంపేయ్‌ పోనీ. ‘కంగ్రాట్స్‌!’ ఏ బడి సార్‌ మీది? మొక్కుబడా? బీడే బేబీ! నాకేనా, ఫోన్‌లోనా?! జీవం ఉండట్లేదు ఎక్కడా మన ఎక్స్‌ప్రెషన్స్‌లో. ఇంకా ఎలా చెప్పాలి? ‘ఇంకా’నా! అసలేం చెప్పారని? హార్ట్‌ని టచ్‌ చేశారా? లేదు! అది ముఖ్యం కదా.. ఓ పని చేయండి. మీట్‌ మిస్‌ యామినీ పేర్నపాటి. మీ ఫీలింగ్స్‌ని ఆమె చక్కటి స్క్రాప్‌బుక్‌లో పెట్టి ఇస్తారు. ఆ బుక్‌ని ప్రెజెంట్‌ చెయ్యండి చాలు. 

ఎన్నెన్నో భావాలు..ఏవేవో రాగాలు..!
ఆత్మీయులకు మరిచిపోలేని కానుక ఇవ్వాలంటే మనం యామిని చేతుల్లో రూపుదిద్దుకునే అరుదైన కళను ఎంచుకోవాల్సిందే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న అనుబంధాన్ని అందమైన కథగా కళ్లకు కట్టే ఆ కానుక మన కళ్ల ముందు ఎప్పటికీ నిలిచి ఉండే ఓ సజీవ దీపిక. సూక్ష్మ చిత్రాల రూపకల్పనతో అందమైన కానుకలు తయారు చేస్తూ తన కళతో అబ్బురపరుస్తుంది యామిని పేర్నపాటి.
 
హైదరాబాద్‌కు చెందిన యామిని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ని వృత్తిగా మార్చుకోవాలని ఆశపడింది. కానీ, తల్లిదండ్రుల ఇష్టం మేరకు బిటెక్‌ చేసింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయ్యింది. ఇప్పుడు ప్రత్యేకంగా జీవన సన్నివేశ చిత్రాలను జీవం ఒలికించేలా రూపొందిస్తూ కస్టమైజ్డ్‌ గిఫ్ట్‌ మేకింగ్‌లో అడుగుపెట్టి ఉపాధి పొందుతోంది. ఆ వివరాలను ఇలా కథలా కళ్లకు కట్టింది... 

ఆన్‌లైన్‌ నైపుణ్యాలు..
‘‘ఐదేళ్ల క్రితం కాలేజీ రోజుల్లో నేషనల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ నెట్‌వర్క్‌లో భాగం అయ్యాను. అప్పుడే సొంతంగా ఉపాధి పొందడం పట్ల ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేదాన్ని. డ్రెస్‌ డిజైనింగ్‌లోనే కాదు క్విల్లింగ్‌ జ్యువెలరీ తయారీలోనూ ప్రశంసలు పొందాను. ఫైన్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ చేయాలనుకున్నాను. కానీ, ‘కళ  ఒక అభిరుచి. అది తిండి పెట్టదు’ అన్నారు పెద్దలు. అందుకే, ఇంజనీరింగ్‌ వైపు వెళ్లాను. కానీ, నా అభిరుచిని వదులుకోలేదు. ఆన్‌లైన్‌ సాయంతోనే పెయింటింగ్‌ టెక్నిక్స్‌ నేర్చుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్రియేటివ్‌ స్టూడియోస్‌’ పేరుతో పేజీని నిర్వహించాను. అయితే, తమ్ముడు చదువుకు ఫీజు చెల్లించడం కోసం నాన్న కష్టపడుతుండటం చూసి బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో చేరిపోయాను. కానీ, కళ లేని జీవితం అసంపూర్ణమనే భావన రోజూ బాధపెడుతుండేది.

ప్రేయసికి బహుమతి
నా సహోద్యోగి ఒకరు తన ప్రేయసికి బహుమతి ఇవ్వడానికి మంచి గిఫ్ట్‌ సూచించమని అడిగాడు. కాలేజీ రోజుల్లో నా ఫ్రెండ్స్‌కి డిజైన్‌ చేసి ఇచ్చిన స్క్రాప్‌ బుక్స్‌ గుర్తుకువచ్చాయి. నేనే స్వయంగా ఒకటి రూపొందించి ఇస్తే.. అని ఆలోచన వచ్చింది. ‘మీ బంధం ప్రత్యేకత చెప్పమ’ని అడిగాను. అతను చెప్పిన ప్రేమకథను ఆధారం చేసుకుంటూ ఒక అందమైన గిఫ్ట్‌ను తయారుచేసి ఇచ్చాను. ఆ కళాకృతికి అబ్బురపడి నాకు కొంతమొత్తాన్ని ఇచ్చాడు. ఆ గిఫ్ట్‌ అతని స్నేహితురాలికి బాగా నచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఆ రోజు నేను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. నాకు ఎక్కడ సంతృప్తి ఉందో.. అదే పని చేస్తే చాలా సంతోషంగా ఉంటానని అర్ధమైంది. అన్నాళ్లూ వదిలేసిన నా కళకు కొత్తగా జీవం పోయాలనుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో we_craft16 పేరుతో కొత్త పేజీని రూపొందించాను. ఏడాదిన్నరగా ఈ పేజీని విజయవంతంగా నిర్వహిస్తున్నాను.

మొదట రెండు మూడు ఆర్డర్లే! 
ఇప్పుడు నాకు నెలలో 30 నుంచి 40వరకు  ఆర్డర్లు అందుతున్నాయి. కానీ, మొదటి రెండు నెలలు మూడు, నాలుగు ఆర్డర్లు మాత్రమే వచ్చేవి. చాలా నిరాశగా అనిపించేది. ఉద్యోగం చేస్తూనే స్క్రాప్‌ బుక్‌ డిజైన్స్‌ చేసేదాన్ని. ఓ వైపు ఆఫీసు పని భారం, మరొవైపు స్క్రాప్‌ బుక్‌ డిజైన్లు. కొన్ని రాత్రులు అస్సలు నిద్రపోయేదాన్నే కాదు. ముందు ఆర్డర్లు విరివిగా రావడం కోసం కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో నేర్చుకున్నాను. గిఫ్ట్‌ బాక్స్‌ తెరిచి చూసినప్పుడు మనం చెప్పాలనుకున్న విషయం అందులోని సూక్ష్మచిత్రాలతో ఇట్టే అర్ధమైపోవాలి. అందుకోసం చాలా శోధించాను. చాలా కృషి చేశాను. దీంతో కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది. 

ప్రత్యేకమైన శైలి
కస్టమర్లు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటాను. వారి మధ్య ఉన్న అందమైన సన్నివేశాన్ని తెలుసుకుంటాను. దానికి తగ్గట్టు క్రాఫ్టింగ్‌ చేస్తాను. ‘ఈ కళ ఎక్కడ నేర్చుకున్నారు?’ అని అడుగుతుంటారు. ఇది నాకు నేనుగా సృష్టించుకున్న కళ. అలాగని, నా వరకే పరిమితం అవ్వాలనుకోను. మరికొందరిని ఇందులో భాగస్వాములను చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ నా ఆలోచనల శైలిని అప్‌గ్రేడ్‌ చేస్తుంటాను కాబట్టి, ఎవరూ దీనిని కాపీ చేయలేరు అని గట్టిగా చెప్పగలను. ఐటి కంపెనీ నాకు చెల్లించే దానికంటే ఎక్కువ సంపాదించగలను అనే నమ్మకం పెరిగింది. నా అభిరుచితోపాటు నా వృత్తిని ఎలా సమతుల్యం చేసుకోవాలో నేర్చుకున్నాను’’ అని యామిని ఆనందంగా వివరించింది. ఉద్యోగం చేసుకుంటూనే నచ్చిన అభిరుచిలో ఉపాధి పొందుతున్న యామిని ఇప్పుడు కళాత్మకంగా రాణిస్తోంది. 
– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు