పిల్లల కథ: ఆనందమాత

25 Jun, 2022 19:20 IST|Sakshi

కంచనపల్లి వేంకట కృష్ణారావు

శంకర్‌ మంచి బొమ్మలు చేసే కళాకారుడు. ఎన్ని బొమ్మలు చేసినా అతని ఆదాయం అంతంత మాత్రమే! అతను చెక్కతో, మట్టితో, లోహంతో బొమ్మలు చేయగలడు. ఒకరోజు ఇంటి ఖర్చుల కోసం డబ్బు అప్పు అడగటానికి  తన స్నేహితుడు మహీపతి దగ్గరకు వెళ్లాడు. ‘ఎందుకు అలా డబ్బుకోసం ఇబ్బంది పడుతున్నావు? నీ చేతిలో కళ ఉంది. తెలివిగా ఉపయోగిస్తే నీకు బాగా డబ్బు వస్తుంది కదా’ అన్నాడు మహీపతి.  ‘కళ అయితే ఉంది అయినా దానిని ఆదరించే వారెవరు? నా బొమ్మలు ఎవరూ కొనడంలేదు’ దిగులుగా చెప్పాడు శంకర్‌. 

‘ప్రస్తుతానికి నీ అవసరానికి డబ్బు ఇస్తానులే. అయితే  ఓ రోజు మాపిల్య చెట్టు కొమ్మతో నువ్వు ఓ బొమ్మను  తయారు చేయడం చూశాను. మాపిల్య చెట్టు కొంత అరుదైన చెట్టే. శ్రద్ధ తీసుకుని పెంచితే  మన భూముల్లోనూ చక్కగా పెరుగుతుంది. నీ బాగు కోరే వాడిగా నేను నా ఎకరం పొలంలో మాపిల్య చెట్లు పెడతాను. అవి రెండేళ్ళలోనే పూర్తిగా పెరుగుతాయి. ఈలోపల అడవిలో దొరికే మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు తయారు చెయ్యి. ఎలాంటి బొమ్మలు చేయాలో, ఆ బొమ్మల్ని ఎలా అమ్ముకోవాలో నేను చెబుతాను’ అని సలహా ఇచ్చాడు  మహీపతి. ‘ఏమిటో మహీపతి నువ్వు చెప్పేదంతా నాకు విచిత్రంగా కనబడుతోంది. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను’ చిరునవ్వుతో చెప్పాడు శంకర్‌. 

రెండురోజుల తరువాత మహీపతి.. మాపిల్య చెట్టు కొమ్మతో తన సృజనాత్మకతను ఉపయోగించి ఓ కొత్త దేవత బొమ్మను తయారు చేయమని శంకర్‌కు చెప్పాడు. మహీపతి చెప్పినట్టుగానే తన సృజనను ఉపయోగించి చక్కని కొత్త దేవత ప్రతిమను చెక్కాడు. చూసి అబ్బురపడ్డాడు మహీపతి. ఆ బొమ్మకు ‘ఆనంద మాత’ అని పేరు పెట్టాడు. శంకర్‌ ఆశ్చర్య పోయి ‘ఈ బొమ్మను ఏంచేస్తావు?’ అని అడిగాడు. ‘అచ్చం ఇటువంటివే పది బొమ్మలు మాపిల్య చెట్టు కొమ్మతో తయారు చేయి. ఏం చేయాలో చెబుతా’ అన్నాడు. మహీపతి చెప్పినట్టే అటువంటి పది బొమ్మలను తయారు చేశాడు శంకర్‌. ఆ బొమ్మలను మహీపతి తీసుకెళ్ళి తన అంగట్లో, తనకు తెలిసిన వాళ్ళ అంగళ్ళలో పెట్టి ‘ఈ దేవత ఆనంద దేవత.. ఈ బొమ్మ ఎవరు పెట్టుకుంటే వారికి అన్నీ కలసి వస్తాయి’ అని చెప్పసాగాడు. 

అంతే ఆ విషయం ఊరంతా పాకింది. ప్రతి వ్యాపారస్తుడు, కొందరు గృహస్తులు ఆ బొమ్మలను కొనాలని ఎక్కడ దొరుకుతాయో అడగసాగారు. ఆవిధంగా శంకర్‌కు చేతినిండా పని, తద్వారా డబ్బూ లభించసాగాయి. కేవలం శంకర్‌ బాగుపడటమే కాక, చాలామంది రైతులూ లాభపడ్డం మొదలెట్టారు.. పొలం గట్ల మీద మాపిల్య చెట్లు పెంచి వాటి కొమ్మలను అమ్ముతూ.  మహీపతి తెలివైన ఆలోచన స్నేహితుడు శంకర్‌ను బాగుపరచడమే కాకుండా రైతులకూ మేలు చేసింది! మరి కొంతమంది మాపిల్య చెట్టు కొమ్మలతో బొమ్మలు చేయడం నేర్చుకోడానికి శంకర్‌ వద్ద శిష్యులుగా చేరారు.

నిజానికి ఆ బొమ్మతో ఏ మేలు జరగక పోయినా ఆ బొమ్మ పెట్టుకోవడం వలన వారి ఆత్మస్థైర్యం పెరిగి సమర్థవంతంగా వారి వ్యాపారాలు, పనులు నిర్వహించుకోసాగారు. (క్లిక్‌: మాష్టారి పాఠం.. పదును పెట్టకపోతే వృథా పోవలసిందే)

మరిన్ని వార్తలు