అల్పాహారానికి అదనపు బడ్జెట్‌ కేటాయించాలి | Sakshi
Sakshi News home page

అల్పాహారానికి అదనపు బడ్జెట్‌ కేటాయించాలి

Published Wed, Nov 1 2023 4:28 AM

వినతిపత్రం అందజేస్తున్న కార్మిక సంఘం నేతలు - Sakshi

● రూ.10.50తో ఎలా సాధ్యం ● అదనపు కలెక్టర్‌, డీఈఓకు మధ్యాహ్న భోజన కార్మికుల వినతి

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అల్పాహారం పథకానికి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రూప్లీ, నర్సమ్మ డిమాండ్‌ చేశారు. మంగళవారం మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, డీఈఓ రాధాకిషన్‌ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అల్పాహారం పథకానికి ప్రత్యేక నిధులు కేటాయించకుండా కా ర్మికులతో వెట్టి చేయిస్తోందని ఆరోపించారు. ప్రతి ఒక విద్యార్థికి రూ.10.50లు చెల్లించి పూరీలు, ఇడ్లీలు పెట్టాలని, అదికూడా ఉదయం 8 గంటల లోపు చేయాలని అధికారులు ఆదేశించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఒక వ్యక్తి హోటల్‌లో టిఫిన్‌ చేస్తే కనీసం 30 నుంచి 40 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. విద్యార్థికి కేవలం రూ.8లు చొప్పున ఇచ్చి రూ.2 వేలు జీతం ఇస్తామనడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ఈ పథకం సజావుగా సాగాలంటే విద్యార్థికి రూ. 25 చొప్పున అల్పాహారానికి చెల్లించాలని, వంట సామగ్రి, గ్యాస్‌ కోసం ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కాటన్‌ చీరలు, గుర్తింపు కార్డులు, అన్ని పాఠశాలలో ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజు, మధ్యాహ్న భోజన కార్మిక నాయకులు లక్ష్మి, యాదమ్మ, పద్మ, దుర్గమ్మ, బుచ్చమ్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement