Afghanistan Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం.. పౌరులపై తాలిబన్ల కాల్పులు

19 Aug, 2021 18:18 IST|Sakshi
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండాతో ర్యాలీ నిర్వహించిన అఫ్గన్‌ ప్రజలు (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

కాబూల్‌: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌లో విధ్వంసకాండ మొదలైంది. నిన్న తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేసిన కొందరి అఫ్గనిస్తాన్‌ జనాలపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు అఫ్గనిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలు చేపట్టిన ర్యాలీపై తాలిబన్లు తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బ్రిటీషర్లు దేశం విడిచిపోయిన సందర్భంగా అఫ్గనిస్తాన్‌లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు.

ఈసారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే కునార్ ప్రావిన్స్‌లోని అసదాబాద్ నగరంలో కొందరు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. వందలాది మంది పురుషులు, కొందరు స్త్రీలు చేతిలో అఫ్గన్‌ జాతీయ జెండాను చేతులో పట్టుకుని వీధుల్లోకి వచ్చి ‘‘మా జెండా.. మా గుర్తింపు’’ అంటూ నినాదాలు చేయసాగారు.

ఈ చర్యలపై ఆగ్రహించిన తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జనాలు భయంతో ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా పలువురు మృతి చెందినట్లు సమాచారం. అయితే తాలిబన్లు జరిపిన కాల్పుల్లోనే వీరు మరణించారా.. లేక తొక్కిసిలాటలో చనిపోయారా అనే విషయం తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు