అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం: ‘బైడెన్‌ రాజీనామా చేయాల్సిందే’

16 Aug, 2021 11:45 IST|Sakshi

బైడెన్‌ వైఫల్యం వల్లే అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం

బైడెన్‌పై మండిపడ్డ డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌ ఆక్రమణ కోసం కాచుకున్న తాలిబన్లకు అమెరికా, నాటో బలగాల ఉపసంహరణతో అవకాశం లభించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. ఈ పరిణామాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం రావడానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడనే కారణమని ట్రంప్‌ ఆరోపించారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ జో బైడెన్ తక్షణమే రాజీనామా చేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించుకోడానికి అవకాశం కల్పించారని, బైడెన్ హాయంలో అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమని మాజీ అధ్యక్షుడు ధ్వజమెత్తారు.

‘అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోవడానికి అనుమతించినందుకు జో బైడెన్ రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాక అమెరికాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, హెచ్-1బీ ఇమ్మిగ్రేషన్ విధానం, ఆర్ధిక, పాలనాపరమైన విధానాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా, అఫ్గాన్‌ నుంచి సైన్యాల ఉపసంహరణకు ట్రంప్ హయాంలోనే బీజం పడింది. దోహా వేదికగా 2020 ఫిబ్రవరిలోనే తాలిబన్లతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు ట్రంప్‌.

భద్రత విషయంలో తాలిబన్ల నుంచి హామీ లభించడంతో అమెరికా, మిత్రరాజ్యాల సైన్యాలను 2021 మే నాటికి పూర్తిగా ఉపసంహరించుకుంటామని ట్రంప్ వెల్లడించారు. అయితే, ఈ ఏడాది జనవరిలో అధికారం చేపట్టిన జో బైడెన్.. అఫ్గాన్‌ నుంచి సైన్యం ఉపసంహరణ గడువును సెప్టెంబరు 1కి పొడిగిస్తూ ఎటువంటి షరతులు విధించలేదు. బైడెన్ నిర్ణయంపై ట్రంప్ పలుసార్లు విమర్శలు చేశారు. ఒకవేళ తాను తిరిగి అధికారంలోకి వచ్చుంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని, బలగాల ఉపసహరణ చాలా విజయవంతంగా జరిగేదని ట్రంప్‌ ఎదురుదాడి చేశారు. ‘‘అఫ్గానిస్తాన్‌ విషయంలో జో బైడెన్‌ చర్యలు చాలా గొప్పవి.. అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఓటమిగా మిగిలిపోతాయి’’ అని ట్రంప్‌ విమర్శించాడు.

ఇక అఫ్గానిస్తాన్‌లో బలగాల ఉపసంహరణ విషయంలో బైడెన్‌ సర్కార్‌పై అమెరికాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌లో అమెరికా రాయబారి రాస్‌ విల్సన్‌ కాబూల్‌లోని దౌత్య కార్యాలయాన్ని వదిలేసి ఆదివారం విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఎంబసీపై ఎగురుతున్న అమెరికా జాతీయ జెండాను తొలిగించి మరీ వెంట తీసుకుపోవడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నాయి. 
 

మరిన్ని వార్తలు