పెన్షన్‌ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి

10 Sep, 2021 18:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వియాన్న: తల్లి చనిపోయింది. కానీ ఆమె మరణించింది అని తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్‌ డబ్బులు రాకుండా ఆగిపోతాయి. అలా జరిగితే తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లి మృతదేహాన్ని మమ్మీగా మార్చాడు. అలా ఏడాది పాటు డెడ్‌బాడీని ఇంట్లోనే పెట్టుకుని కాలం వెళ్లదీయసాగాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

89 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడి(66)తో కలిసి టైరోల్ ప్రాంతంలోని ఇన్స్‌బ్రక్ సమీపంలో నివసిస్తుండేది. వృద్ధురాలికి ప్రతి నెల పెన్షన్‌ వస్తుండేది. ఈ క్రమంలో గతేడాది జూన్‌లో సదరు వృద్ధురాలి మరణించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్‌ ఆగిపోతుందని భావించిన ఆమె కుమారుడు.. తల్లి మృతదేహాన్ని ఐక్‌ప్యాక్స్‌లో పెట్టి భద్రపరిచాడు. 
(చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్‌ ఎందుకివ్వరు?)

ఆ తర్వాత తల్లి మృతదేహానికి బ్యాండేజ్‌లు చుట్టి.. రసాయనాలలో ఉంచాడు. బ్యాండేజ్‌లు ఆ ద్రవాలను పీల్చుకుని.. మృతదేహాన్ని మమ్మీలా మార్చాయి. ఆ తర్వాత మమ్మీగా మార్చిన మృతదేహాన్ని ఇంటిలోపల దాచాడు. ఇక అతడి సోదరుడు తరచుగా ఇంటికి వచ్చి తల్లి గురించి ప్రశ్నించేవాడు. దానికి నిందితుడు.. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చాను అని తెలిపేవాడు. ఇలా ఏడాదిగా తల్లి మరణాన్ని దాచి ఆమె పేరు మీద వస్తోన్న పెన్షన్‌ డబ్బులను తీసుకున్నాడు. అలా ఇప్పటి వరకు 60 వేల డాలర్ల(44,05,743 రూపాయలు) పెన్షన్‌ సొమ్మును తీసుకున్నాడు.
(చదవండి: వృద్ధ గోవులకు పింఛను)

ఎలా బయటిపడిందంటే..
ఏడాదిపాటుగా సాగుతున్న ఈ వ్యవహారం కొత్త పోస్ట్‌మ్యాన్‌ రాకతో బయటపడింది. పెన్షన్‌ సొమ్ము ఇవ్వడానికి ఇంటికి వచ్చిన కొత్త పోస్ట్‌మ్యాన్‌ తాను లబ్ధిదారుని చూశాకే డబ్బులు ఇస్తానని తెలిపాడు. అందుకు నిందితుడు అంగీకరించలేదు. దాంతో పోస్ట్‌మ్యాన్‌ ఈ వ్యవహారం తేడాగా ఉందని భావించి.. అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు నిందితుడి ఇంటికి వచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రసుత్తం నిందితుడిని అరెస్ట్‌ చేసి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

చదవండి: విజేత: కల చెదిరినా కాసుల వర్షం కురిసింది

>
మరిన్ని వార్తలు