తైవాన్‌పై జోక్యం చేసుకోవద్దు

30 Jul, 2022 00:57 IST|Sakshi

బైడెన్‌కు జిన్‌పింగ్‌ గట్టి హెచ్చరికలు

బీజింగ్‌: తైవాన్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చైనా అధినేత జిన్‌పింగ్‌ గట్టిగా హెచ్చరించారు. వ్యూహాత్మక కారణాలతో ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య విభేదాలు మంచిది కాదని కూడా జిన్‌ పింగ్‌ పేర్కొన్నట్లు చైనా వెల్లడించింది. ఇలాంటి వైఖరి ప్రపంచ ఆర్థిక పురోగతిపై పెను ప్రభావం చూపుతుందన్నారు. ‘చైనా ప్రధాన భూభాగం నుంచి వేరుపడేలా తైవాన్‌ను ప్రేరేపించే వెలుపలి శక్తులను ఎదుర్కొంటాం.

140 కోట్ల చైనా ప్రజల అభీష్టమైన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటాం. నిప్పుతో ఆడాలనుకుంటే భస్మం అవుతారు’అంటూ గట్టి హెచ్చరికలు పంపింది. ఒకే చైనా విధానాన్ని అమెరికా గౌరవించాలని పేర్కొంది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని తగ్గించడం, స్థూల ఆర్థిక విధానాలను సమన్వయం చేయడం, కోవిడ్‌తో పోరాటం, ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించుకోవడం వంటి వాటిపై సహకరించాలని అమెరికాను జిన్‌పింగ్‌ కోరారని చైనా ఒక ప్రకటనలో వివరించింది.

గురువారం ఈ ఇద్దరు నేతలు దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా ఫోన్‌ సంభాషణ జరిపిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ త్వరలో తైవాన్‌ సందర్శిస్తారంటూ వస్తున్న వార్తలపై చైనాలింకా స్పందించలేదు. అయితే, బైడెన్, జిన్‌పింగ్‌ నవంబర్‌లో ఇండొనేసియాలో జరిగే జి–20 భేటీలో ముఖాముఖి సమావేశమయ్యే అవకాశాలున్నాయని అమెరికా అధికారి ఒకరు తెలిపారు.
 

మరిన్ని వార్తలు