తలవంచిన ఎల్​చాపో భార్య.. నవ్వుతూ శిక్షకు సిద్ధం

11 Jun, 2021 20:07 IST|Sakshi

వాషింగ్టన్​ :  మెక్సికన్​ డ్రగ్​ బాస్(మాజీ)​ వాకిన్​ ‘ఎల్​ చాపో’ గుజ్మన్​ భార్య​ ఎమ్మా కరోనెల్ ఎస్పూరో ఎట్టకేలకు నేరాల్ని అంగీకరించింది. జీవిత ఖైదు, పది మిలియన్ల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందన్న నేపథ్యంలో వాషింగ్టన్​ కోర్టు ముందు గురువారం ఆమె తలవంచింది. ఈ తరుణంలో ఆమె శిక్షను పదేళ్ల కాలానికి తగ్గించే అవకాశం ఉండొచ్చనేది న్యాయ నిపుణుల మాట. కాగా, ఆమె భర్తైన 63 ఏళ్ల గుజ్మన్​ మనీ లాండరింగ్​, డ్రగ్​ అక్రమ రవాణా ఆరోపణ, హత్యలు-అత్యాచారాల నేరాలపై కొలరాడో జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

ఇక సినాలోవా డ్రగ్​ కార్టెల్​.. అమెరికాలో అతిపెద్ద డ్రగ్​ సప్లయర్. దాని ఆర్థిక వ్యవహారాలన్నీ కరోనెల్​ చూసుకున్నట్లు, మనీలాండరింగ్​కు పాల్పడినట్లు, అక్రమంగా మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటితోపాటు 2015లో మెక్సికో జైలు నుంచి పారిపోవడానికి గుజ్మన్​ ప్రయత్నించినప్పుడు కరోనెల్​ సహకరించిందనే ఆరోపణలన్నీ ఆమె చిరునవ్వుతో ఒప్పుకుంది. ‘ఆమె జైలుకు వెళ్లడానికి సంతోషంగా సిద్ధమైంది. ఎల్​చాపో అరెస్ట్​ అయ్యాక.. తనను అరెస్ట్ చేయరని ఆమె అనుకుంది. కానీ, ఆమె బ్యాడ్​లక్​’ అని ఆమె అటార్నీ లిట్చ్​మన్​ మీడియాకు వెల్లడించాడు. అయితే శిక్ష తగ్గింపు ఒప్పందం మేరకే ఆమె నేరాల్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.

అప్సరసలాంటి కరోనెల్​
ఎమ్మా కరోనెల్ ఎస్పూరోకి యూఎస్​-మెక్సికన్​ పౌరసత్వం ఉంది. ఆమె చాలా అందగత్తె. అంతేకాదు మాజీ బ్యూటీ క్వీన్ కూడా. జర్నలిజం చదివిన కరోనెల్​.. పదిహేడేళ్ల వయసులో ఓ డ్యాన్స్​ ప్రోగ్రాంలో ఎల్​ చాపోని కలిసింది. ఆ తర్వాత అతనితో సహజీవనం చేస్తూ కవలల్ని కనింది. ఆ తర్వాతే వాళ్ల పెళ్లి జరిగింది. అయితే డ్రగ్స్​ దందాలో భార్య కరోనెల్ అందాల్ని ప్రత్యర్థులకు ఎరగా వేసి హతమార్చేవాడని ఎల్​ చాపోపై ఒక అపవాదు ఉంది. గుజ్మన్​ న్యూయార్క్​ జైల్లో ఉన్నప్పుడు మూడు నెలలపాటు రోజూ ఆమె అతన్ని కలిసింది. ఆ తర్వాత 31 ఏళ్ల వయసున్న కరొనెల్‌ను డలాస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్​ రవాణా ఆరోపణలపై అరెస్ట్ చేసి.. వర్జీనియా జైలుకు తరలించారు.


 
ఫ్యాషన్​ ఇండస్ట్రీలో..
సినాలోవా రాష్ట్రం(మెక్సికో)లో ఓ పేద కుటుంబంలో పుట్టిన ఎల్​చాపో గుజ్మన్.. డ్రగ్స్​ దందాతో ప్రపంచ కుబేరుల జాబితాకు చేరిన విషయం తెలిసిందే. డబ్బు, పరపతి మోజులో ఎమ్మా కరోనెల్​ అతనితో చేతులు కలిపింది. ఈ ఇద్దరూ కలిపి చేసిన నేరాలు ఒళ్లు గగ్గురు పొడిచే విధంగా ఉంటాయని చెప్తుంటారు. అంతేకాదు ఎల్ చాపో, ఎమ్మా కరొనెల్ జంటను స్టయిల్ ఐకాన్స్‌గా భావిస్తారు. 'ఎల్ చాపో గుజ్‌మన్' బ్రాండ్‌తో బిజినెస్​ చేస్తున్నారు కూడా. అలాగే ఎల్​చాపో మరో కూతురు(వేరే భార్య కూతురు) అలెగ్జాండ్రినా గుజ్మన్​ కూడా తండ్రి పేరు మీద బట్టల వ్యాపారం చేస్తోంది. అంతేకాదు ఈ కరోనా టైంలో తండ్రి పేరు మీదుగా ఆమె సహాయక కార్యక్రమాలు చేస్తుండడం విశేషం.


చదవండి: ఇంటర్వ్యూతో దొరికాడా?

మరిన్ని వార్తలు