మసీదులో మారణకాండ

9 Oct, 2021 04:11 IST|Sakshi
మృతదేహాలను బయటకు తరలిస్తున్న స్థానికులు

అఫ్గాన్‌లో ఆత్మాహుతి

పేలుడులో 60మంది మృతి

షియా వర్గీయులే లక్ష్యం  

కాబూల్‌: పశ్చిమ అఫ్గానిస్తాన్‌ కుందుజ్‌ ప్రావిన్సులోని గోజార్‌ ఇ సయీద్‌ అబాద్‌ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్‌ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్‌ న్యూస్‌ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.

దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్‌ ప్రావిన్స్‌ తాలిబన్‌ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్‌ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు.  

ఐసిస్‌ హస్తం
మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్‌పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్‌ అనుబంధ సంస్థ ఐసిస్‌– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్‌ న్యూస్‌లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్‌ఐటీఈ ఇంటిలిజెన్స్‌ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్‌–కే టెలిగ్రామ్‌ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్‌ దాడులు చేసిన చరిత్ర ఉంది.

అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్‌ ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్‌–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్‌ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్‌ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్‌ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది.
 

మరిన్ని వార్తలు