Afghanistan: అధికారం కోసం హక్కానీ, బరాదర్‌ పోరు

5 Sep, 2021 13:10 IST|Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌లో అధికారం ఎవరు చేపట్టనున్నారనే దానిపై గందరగోళం నెలకొంది. ముల్లా బరాదర్‌తో ప్రభుత్వాన్ని పంచుకోవటానికి హక్కానీ నెట్‌వర్క్‌ సిద్దంగా లేనట్లు సమాచారం. హక్కానీ గ్రూపునకు పాకిస్తాన్‌ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. ఈ గ్రూపు అతి సాంప్రదాయవాద సున్నీ పస్తున్‌ ప్రభుత్వం వైపు మొగ్గుచూపుతోంది. దోహ శాంతి చర్చల్లో తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగం చీఫ్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. (చదవండి: అఫ్గానిస్తాన్‌ కొత్త అధ్యక్షుడిగా బరాదర్‌?)

అంతర్జాతీయ సమాజం ఆమోదం పొందేలా మైనారిటీలు ప్రభుత్వంలో భాగం కావాలని బరదార్‌ కోరుకుంటున్నారు. కానీ, హక్కానీ అధినేత, తాలిబన్ల ఉప నాయకుడు సిరాజుద్దీన్‌ అతని టెర్రరిస్ట్‌  మిత్రులు మాత్రం ఎవరితోనూ ప్రభుత్వాన్ని పంచుకోవటాని ఇష్టపడటం లేదు. నూటికి నూరు శాతం తాలిబన్‌ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు. తాము కాబూల్‌ని గెలుచుకున్నామని, అఫ్గన్‌ రాజధానిపై ఆధిపత్యం కలిగిఉన్నామని, వెనక్కు తగ్గాలని బరాదర్‌ను కోరారు. కాగా, బరాదర్‌ ప్రభుత్వాధినేతగా శనివారమే అఫ్గన్‌లో ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ, చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో వచ్చే వారం ఏర్పాటు చేస్తామని తాలిబన్లు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు