భద్రతామండలి అధ్యక్ష హోదాలో భారత్‌

1 Aug, 2021 03:52 IST|Sakshi

శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన అంశాలపై కీలక చర్చలకు సారథ్యం

ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతామండలి అధ్యక్ష హోదా భారత్‌ దక్కింది. నేటి నుంచి నెల రోజులపాటు పాటు ఈ హోదాలో కొనసాగనుంది. ఈ సమయంలో సముద్రప్రాంత రక్షణ, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి ప్రధాన అంశాలపై జరిగే కీలక చర్చలకు నేతృత్వం వహించనుందని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టుతోపాటు వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ అవకాశం భారత్‌కు దక్కుతుంది.

ఈ ఆగస్టులో భారత్‌.. సముద్ర ప్రాంత భద్రత, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన అంశాలపై మండలిలో జరిగే ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్ష వహించనుంది. ‘సముద్ర ప్రాంత రక్షణ భారత్‌కు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. దీనిపై మండలి సమగ్రమైన విధానాన్ని తీసుకురావడం చాలా ముఖ్యం’ అని తిరుమూర్తి పేర్కొన్నారు. ‘అదేవిధంగా, శాంతిపరిరక్షణ దళాలను పంపడంలో ఆదినుంచి భారత్‌ ముందుంంది. వివిధ దేశాలకు పంపే శాంతిపరిరక్షక దళాల భద్రతకు మెరుగైన సాంకేతికతను వినియోగించడం, దళాలపై దాడులకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెట్టే విషయమై భారత్‌ దృష్టి సారిస్తుంది’ అని వివరించారు.

>
మరిన్ని వార్తలు