Israel-Hamas War: కన్నలూ, నన్ను మిస్సయ్యారా!?

26 Nov, 2023 05:37 IST|Sakshi
హమాస్‌ చెర నుంచి తిరిగొచ్చిన భార్యబిడ్డలతో అషెర్, 9 ఏళ్ల కుమారునితో అవీ

జెరుసలేం/టెల్‌ అవీవ్‌: శుక్రవారం రాత్రి వేళ. ఇజ్రాయెల్‌లోని ష్నెయ్‌డర్‌ పిల్లల ఆస్పత్రి. ప్రధాన ద్వారమంతటా భావోద్వేగ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 57 ఏళ్ల అవీ జిచ్రీ చాలాసేపటి నుంచి ఎంతో ఆత్రుతతో, ఉద్వేగంతో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికీ ప్రధాన ద్వారం కేసి చూస్తూ గడుపుతున్నాడు. ఎట్టకేలకు అతని ఎదురుచూపులు ముగిశాయి.

తొమ్మిదేళ్ల చిన్నారి ఒహద్‌ అతని వైపు మెరుపు వేగంతో పరుగెత్తుకొచ్చాడు. వస్తూనే, ‘నాన్నా!’ అంటూ గట్టిగా కరుచుకుపోయాడు. ఆ క్షణాన వారి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ వెనకే అవీ భార్య, తల్లి కూడా వచ్చి అతన్ని అమాంతం వాటేసుకున్నారు! ఆ పక్కనే ఉన్న 38 ఏళ్ల అషెర్‌దీ అతని పరిస్థితే!

తన భార్య డొరాన్, కూతుళ్లు అవివ్‌ (4), రజ్‌ (2) ఆస్పత్రి ప్రాంగణంలో రెడ్‌ క్రాస్‌ వాహనం దిగీ దిగగానే వారి దగ్గరికి పరుగులు తీశాడు. ముగ్గురినీ బిగ్గరగా వాటేసుకున్నాడు. తనను చూసిన ఆనందంలో కేరింతలు కొడుతున్న కూతుళ్లను పదేపదే ఆప్యాయంగా తడిమి చూసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ‘‘కన్నలూ, నన్ను మిస్సయ్యారా? నన్నే తలచుకుంటూ బాధ పడ్డారు కదూ!’’ అంటూ కూతుళ్లపై ముద్దుల వర్షం కురిపించాడు.

49 రోజుల హమాస్‌ నిర్బంధం నుంచి తొలి విడతలో విడుదలైన 13 మంది ఇజ్రాయెల్‌ బందీలు తమవారిని కలుసుకున్న సందర్భంలో కనిపించిన భావోద్వేగ సన్నివేశాలివి. వీటికి సంబంధించి ఆస్పత్రి విడుదల చేసిన వీడియోలు వైరల్‌గా మారాయి. అక్టోబర్‌ 7 నాటి మెరుపు దాడిలో వీరంతా హమాస్‌ మిలిటెంట్లకు బందీలుగా చిక్కారు.

చిన్నారి ఒహద్‌ హమాస్‌ చెరలోనే తొమ్మిదో పుట్టినరోజు చేసుకోవడం విశేషం! ఆ రోజు ఇజ్రాయెల్‌ అంతా అతని పుట్టినరోజు వేడుకలు జరిపి సంఘీభావం ప్రకటించింది! ఒహద్‌తో పాటే అతని తల్లి, నాయనమ్మ విడుదలైనా తాతయ్య హమాస్‌ చెరలోనే ఉన్నాడు. ఎమిలియా అలోనీ అనే ఐదేళ్ల చిన్నారి కూడా తల్లితో పాటు విడుదలైంది. తమకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న నాయనమ్మను కలుసుకుని ఆనందంలో మునిగిపోయింది.

మరిన్ని వార్తలు