Libya: లిబియాలో తీవ్ర విషాదం 2000 మందికిపైగా మృతి

12 Sep, 2023 14:00 IST|Sakshi

ట్రిపోలీ: మొరాకోలో తీవ్ర భూకంపం మిగిల్చిన విషాదాన్ని మరువక ముందే ఆఫ్రికా దేశమైన లిబియాలో పెనువిషాదం చోటు చేసుకుంది. లిబియాలో డానియల్ తుఫాను ప్రభావంతో డెర్నా నగరాన్ని వరదలు ముంచెత్తగా వరద ప్రవాహానికి సుమారు 2000 మంది చనిపోయి ఉంటారని ఐదారు వేల మంది గల్లంతయి ఉంటారని అంచనా వేస్తున్నారు అక్కడి అధికారులు.

ఒకపక్క సాయుధ దళాల తిరుగుబాటుతో అట్టుడుకుతున్న లిబియాను వరదలు ముంచెత్తాయి. తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో డానియెల్ తుఫాను ప్రభావంతో కుండపోతగా వాన కురిసింది. దీంతో ఒక్కసారిగా వరదలు పోటెత్తడంతో సుమారు 2 వేల మంది మృతిచెందగా ఐదారు వేల మంది వరదల్లో గల్లంతయ్యారని మొరాకో దేశ ప్రధాని ఒసామా హమద్‌ తెలిపారు. 

డ్యామ్‌లన్నీ నిండి ఉప్పొంగడంతో నీటిప్రవాహానికి డెర్నా నగరం మునిగిపోయిందని పెద్ద పెద్ద వంతెనలు, ఎత్తయిన భవనాలన్నీ నేలమట్టమయ్యాయని తెలిపారు. డేనియల్‌ తుఫాను మరింత ఉధృతం కావడంతో డెర్నా, జబల్‌ అల్‌ అఖ్దర్‌, అల్‌-మార్జ్‌ తదితర నగరాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయని వందలాది మంది లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయారని, వారిని కాపాడేందుకు సైన్యం, సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయన్నారు. 

ఇదిలా ఉండగా డెర్నా నగరంలోని నదిపై ఉన్న ఆనకట్ట కూలిపోవడంతోనే విపత్తు మరింత తీవ్రమైందని లిబియా నేషనల్ ఆర్మీ  ప్రతినిధి అహ్మద్ మిస్మారీ చెప్పారు. తీర ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం జరిగిందని అన్నారు. 

ఇది కూడా చదవండి: సమావేశాలు విజయవంతం.. ఆ క్రెడిట్ మొత్తం భారత్‌దే

మరిన్ని వార్తలు