సంక్షోభానికి చివరి అంచున నిలబడ్డ పాక్‌! చివరికి శ్రీలంకలానే..

31 Jan, 2023 21:08 IST|Sakshi

పాక్‌లో ఆర్థిక పరిస్థితులు చాల ఘోరంగా ఉన్నాయి. మరోవైపు ఐఎంఎఫ్‌ అధికారులు నగదు విషయమై చర్చించేందుకు మంగళవారం పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లో తీవ్ర ఆందోళనలో మొదలయ్యాయి. ఒక పక్క రూపాయి విలువ పతనమవ్వడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో.. నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి డిమాండ్‌ చేసిన పన్నుల పెంపు, సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా పోరాడారు.

దీంతో ఇటీవల పాక్‌  దివాలా దిశగా అడుగులు వేసింది. అదీగాక స్నేహ పూర్వక దేశాలు సాయం చేసేందుకు రాకపోవడంతో పాక్‌ ఐంఎఫ్‌ డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. అంతేగా యూఎస్‌ డాలర్ల బ్లాక్‌మార్కెట్‌ని నియంత్రించడానికి ప్రభుత్వం రూపాయిపై నియంత్రణలను సడలించింది. దీంతో కరెన్సీ రికార్డు స్థాయికి పడిపోయింది. అలాగే తక్కువ ధరకే లభించే కృత్రిమ పెట్రోల్‌ ధరలను సైతం పెంచారు. ఈ మేరకు  ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త అబిద్‌ హసన్‌ మాట్లాడుతూ.."తాము సంక్షోభానికి చివర అంచులో ఉన్నాం.

తమ ప్రభు​త్వం ఐఎంఎఫ్‌ డిమాండ్లను నెరవేర్చడం గురించి ప్రజలకు తెలియజేయాలి. లేదంటే దేశం కచ్చితంగా సంక్షోభంలో మునిగిపోతుంది. చివరికి శ్రీలంకలా అయిపోతుంది. ఐతే మా పరిస్థితి మాత్రం బహుశా అక్కడికంటే ఘోరంగా ఉండొచ్చు." అని ఆవేదనగా చెప్పారు. కాగా, శ్రీలంక కూడా పాక్‌ మాదిరిగానే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, చివరికి ఆ దేశ నాయకుడు దేశం విడిచి పారిపోయే పరిస్థితికి దారితీసింది. అదీగాక పాకిస్తాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ ఎకనామిక్స్‌కి చెందిన విశ్లేషకుడు నాసిర్‌ ఇక్బాల్‌ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని, వాస్తవంగా కుప్పకూలిపోతుందని హెచ్చరించారు కూడా.

కొనుగోలు చేయలేని స్థితిలో ప్రజలు
ప్రపంచంలోనే ఎక్కువ వినియోగదారులు ఉన్న ఐదవ అతిపెద్ద స్టేట్‌ బ్యాంకులో సుమారు రూ. 30 వేల కోట్లు (3.7 బిలియన్‌ డాలర్లు) మాత్రమే ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులను కొనుగోలు చేయడానికే సరిపోతుంది. దీంతో కొనుగోలు చేయలేని సరుకంతా కరాచీ పోర్టులోని వేలాది షిప్పింగ్‌ కంటైనర్‌లలోనే ఉంటుంది. రూపాయి పతనంలో పరిశ్రమలు కుదేలయ్యాయి. ప్రజా నిర్మాణ ప్రాజెక్టు ఆగిపోయాయి.

టెక్స్‌టైల్స్‌ ప్యాక్టరీలు పాక్షికంగా మూతపడ్డాయి. దీంతో పెట్టుబడులు మందగించాయి. డజన్ల కొద్ది కూలీలు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఫలితంగా బిక్షాటన చేసే వారి సంఖ్య పెరిగింది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల ఆదాయం మార్గాలు తగ్గడంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని దారుణ స్థితిలో ఉన్నారు. 

గందరగోళంగా ఉన్న రాజకీయ పరిస్థితులు
జూన్‌లో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 33 మిలియన్‌ డాలర్ల రుణాలు ఇతర విదేశీ చెల్లింపులు చెల్లించాల్సి ఉందని స్టేట్‌ బ్యాంకు గవర్నర్‌ జమిల్‌  అహ్మద్‌ గత నెలలో వెల్లడించారు. మరోవైపు దేశం తీవ్ర ఇంధన కొరతతో అల్లాడుతోంది. గత వారం ఖర్చుల కోత చర్యల కారణంగా.. విద్యుత్‌ గ్రిడ్‌లో సాంకేతిక లోపం సంభవించి.. ఒక రోజంతా అంధకారంలోనే ఉండిపోయింది. ఐతే పాక్‌ పెట్రోలియం మంత్రి ముసాదిక్‌ మాలిక్‌ ఏప్రిల్‌ నుంచి రష్యా చమురు దిగుమతులు ప్రారంభమవుతాయని, ఒప్పందంలో భాగంగా స్నేహ పూర్వక దేశాల మధ్య కరెన్సీలలో చెల్లింపులు జరుగుతాయని ఆశాభావంగా చెప్పారు.

ఇదిలా ఉండగా పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ముందస్తు ఎన్నికల కోసం తన ప్రయత్నంలో భాగంగా పాలక కూటమిపై ఒత్తిడి పెంచారు. గతేడాది అవిశ్వాస తీర్మానం కారణంగా పదవి నుంచి తొలగించబడ్డ ఖాన్‌ 2019లో ఐఎంఎఫ్‌తో బహుళ బిలియన్‌ డాలర్ల రుణ ప్యాకేజీపై చర్చలు జరిపారు. ఐతే ఈ కార్యక్రమం అనుహ్యంగా నిలిచిపోయింది. ఇప్పటికే రెండు డజన్లకు పైగా ఖరారు చేసుకున్న ఐఎంఎఫ్‌ ఒప్పందాలు విచ్ఛిన్నమయ్యాయి.

ఒకవేళ పాకిస్తాన్‌ ఈ పరిస్థితి నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారడమే గాక పేదరికి తీవ్రతరం అవుతుందని రాజీకీయ విశ్లేషకుడు మైఖేలే కుగెల్‌ మాన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దేశంలో పెద్దస్థాయిలో సంస్కరణలు తీసుకురాలేకపోతుందని, తదుపరి సంక్షోభాన్ని ఎదుర్కోనే దేశంగా చిట్టచివరి అంచున నిలబడి ఉందని అన్నారు. 
(చదవండి: పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు