ఇరాన్‌లో ఆగని అణచివేత.. మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులపై బలగాల కాల్పులు

17 Nov, 2022 12:13 IST|Sakshi

టెహ్రాన్‌: ఇరాన్‌లో మహ్‌సా అమినీ లాకప్‌ డెత్‌ కారణంగా హిజాబ్‌ వ్యతిరేక అందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక మరోవైపు ఇదే నవంబర్‌లో  2019లో పెట్రోల్‌ ధరల పెంపు విషయమై బ్లడీ అబాన్ (బ్లడీ నవంబర్‌) పేరిట పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ నిరసనల అణచి వేత వార్షికోత్సవం సందర్భంగా అప్పటి నిరసనలో చనిపోయిన సుమారు వంద మందిని స్మరించుకుంటూ నిరసనకారులు ఇరాన్‌ వీధుల్లో మూడు రోజుల పాటు నిరసనలకు పిలుపునిచ్చారు.

ఇప్పుడూ ఈ నిరసనలు హిజాబ్‌ వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు తోడవ్వడంతో వాటిని అణిచివేసే భాగంలో ఇరాన్‌ భద్రతా బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అందులో భాగంగానే  టెహ్రాన్‌లోని ఓ మెట్రోస్టేషన్‌లోని ప్రయాణికులపై భద్రతా బలగాలు కాల్పలు జరిపాయి. కాల్పులతో బెదిరిపోయిన ప్రయాణికులు.. అక్కడి నుంచి పారిపోయేయత్నం చేయడం, కింద పడిపోవడం చూడొచ్చు. ఇక మరో వీడియోలో అండర్‌ గ్రౌండ్‌ రైలులో.. హిజాబ్‌ ధరించని మహిళలను సివిల్‌ దుస్తుల్లో ఉన్న పోలీసులు చెదరగొట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మా పోరాటం కొనసాగుతుంది. ఇరాన్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయి అంటూ నినాదాలు చేయడం వీడియోలో గమనించొచ్చు. 

హిజాబ్‌ ధరించనందుకే  మహ్‌సాను అరెస్ట్‌ చేశారు పోలీసులు. పోలీసుల కస్టడీలోనే సెప్టెంబర్‌ 16వ తేదీన మృతి చెందింది. దీంతో ఇరాన్‌ అంతటా పెద్ద ఎత్తున​ హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదీగాక అమిన్‌ మరణ తదనంతరం గత మూడు నెలలుగా జరుగుతున్న​ నిరసనల్లో ఒక పోలీసు, సెక్యూరిటీ అధికారి, ట్రాఫిక్‌ పోలీసుని నిరసకారులు హతమార్చడంతో కోర్టు వారికి మరణశిక్షలు విధించమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సాయుధ బలగాలు బహిరంగంగా కాల్పులకు తెగబడ్డాయి. అతేగాక పశ్చిమ నగరంలోని సనందాజ్‌లోని కుర్దిస్తాన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులపై కూడా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ మేరకు ఇరాన్‌ మానవ హక్కుల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అమినో మరణంతో చెలరేగిన హింసాకాండలో భద్రతా దళాలు 43 మంది పిల్లలు, 26 మంది మహిళలతో సహా సుమారు 342 మందిని చంపినట్లు పేర్కొంది.

అంతేగాక కనీసం 1500 మంది నిరసకారులను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఐతే ఇరాన్‌ అధికారులు ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌ మానవ హక్కుల డైరెక్టర్‌ మహమూద్‌ అమిరీ మొగద్దమ్‌ ఇరాన్ ఈ మరణశిక్షలను ఖండించడమే గాక వారిని నేరాలను అంగీకరించేలా చేసేందుకు ఈ హింసకు పాల్పడిందని అన్నారు. ఇరాన్‌ చెరలో ఉన్నవారందరికీ సాముహిక మరణ శిక్షలు విధించే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం టెహ్రాన్‌ మెట్రోస్టేషన్‌లో ప్రయాణికులపై బలగాలు జరిపిన కాల్పులకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్‌ అవుతోంది. 

(చదవండి: చెట్లకు సెలైన్‌లో విషం పెట్టి.. లక్షకు కిలో లెక్కన అమ్మి..  )

మరిన్ని వార్తలు