రాజపక్స కుటుంబానికి బిగ్‌ షాక్‌.. దేశం విడిచి వెళ్లకుండా నిషేధాజ్ఞలు

15 Jul, 2022 17:15 IST|Sakshi

కోలంబో: ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో.. ఆపై రాజకీయ సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్‌ తగిలింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్‌ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. 

ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్‌ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో ఇవాళ లంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్‌ జస్టిస్‌ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. 

ఇప్పటికే గోటబయ దేశం విడిచి వెళ్లారని, కాబట్టి మహీంద బాసిల్‌లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిగ్గా తీవ్ర నిరసనల నడుమే ప్రధాని హోదాలో కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించిన మహీంద రాజపక్స.. చివరకు రాజీనామా చేసి అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయారు. కొత్త కేబినెట్‌ గనుక కొలువుదీరితే మాత్రం.. అవినీతి, ఇతరత్ర ఆరోపణలపై రాజపక్స కుటుంబం విచారణ.. రుజువైతే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది.

కుటుంబ పాలనతో ద్వీప దేశాన్ని సర్వనాశనం చేశారని రాజపక్స కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడిగా, అతని అన్న మహీంద రాజపక్సా ప్రధానిగా,  మరో సోదరుడు బసిల్‌ రాజపక్సా ఆర్థిక శాఖను, పెద్దన్న చామల్‌ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా, మరో బంధువు నమల్‌ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా కీలక పదవులను నిర్వహించారు.

మరిన్ని వార్తలు