త‍్వరపడండి.. ఇళ్లు ఖరీదు కేవలం రూ. 87 మాత్రమే

24 Aug, 2021 02:11 IST|Sakshi

రోమ్‌: మీరు ఇల్లు కొనాలి అనుకుంటున్నారా..? అయితే త్వరపడండి ఇది మీకు మంచి అవకాశం. అతి చౌకైన ధరకే ఇళ్లు అందుబాటులో ఉన్న సంగతి మీకు తెలుసా..? అత్యంత సుందరమైన ప్రదేశంలో అది కూడా అన్ని వసతులతో నిండి ఉన్న ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ఎంత చౌక అంటే ఆ ఇంటి విలువ కేవలం రూ. 87 రూపాయలు మాత్రమే. నమ్మడం కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజం. అయితే ఈ చాన్స్‌ మన దేశంలో కాదు. ఇటలీలో మాయోంజా అనే అందమైన పట్టణం ఉంది. ఇది రోమ్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ పట్టణంలో ఇళ్లు ఒక యూరో కంటే తక్కువ ధరకే అక్కడి ప్రభుత్వం వారు విక్రయిస్తున్నారు. మరి ఇంత అందమైన నగరంలో, సువిశాలమైన ఇళ్లను ఎందుకు ఇంత తక్కువ ధరకే అమ్ముతున్నారంటే ఆ ప్రదేశంలోని 90 శాతం ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దానితో ఎంతో అందమైన ఈ ప్రదేశం ఇప్పుడు ఎవరూ నివసించకపోవడంతో బోసిపోయింది. అందుకే అక్కడి ప్రభుత్వం వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మాయోంజాలోని ఇళ్లల్లో ప్రజలు నివాసముండడానికి ప్రోత్సహించేందుకు అతి తక్కువ ధరకే ఈ ఇళ్లను విక్రయిస్తున్నారు. మాయోంజా నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకే ఇలా ఇళ్లను తక్కువ ధరకే విక్రయిస్తున్నామని అక్కడి మేయర్ క్లాడియో స్పెర్డుటి పేర్కొన్నారు. అయతే ఈ ఇళ్లను విడతల వారీగా విక్రయానికి ఉంచనున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే తొలి విడతలో భాగంగా ఇళ్ల కొనుగోళ్లకు సంబందిచిన దరకాస్తుల స్వీకరణ ఈ నెల 28న ముగియనుంది.

ఈ పట్టణం ఒకప్పుడు నిత్యం ప్రజలతో కళకళలాడుతూ ఉండేది. అయితే 1968వ సంవత్సరంలో వచ్చిన భూకంపం ప్రభావంతో చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దానితో మాయోంజ పట్టణం పూర్తిగా ఖాళీ అయింది. ప్రస్తుతం ప్రజలు నివసించక అక్కడ అన్నీ ఖాళీ ఇళ్లే దర్శనమిస్తాయి. మళ్లీ ఎలాగైనా ఆ పట్టణం జనంతో కళకళలాడేలా చేయాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను అతి తక్కువ ధరకే వేలంలో విక్రయిస్తోంది. అందుకే కనిష్ఠ ధర ఒక యూరోగా నిర్ణయించింది. ఒక యూరో అంటే మన ఇండియన్‌ కరెన్సీలో దాదాపు 87 రూపాయలు. ఈ ధర చెల్లించి ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక్కొక్కరు ఒకటి కంటే ఎక్కువ వేలం పాటల్లోనూ పాల్గొనవచ్చు.
టౌన్ అత్యంత పురాతనమైనది కావడంతో ఇక్కడ ఇళ్లు రోడ్డుకు ఇరువైపుల ఒకదానికి దగ్గరగా ఇంకొకటి కలిసి ఉంటాయి. అన్ని కుటుంబాలు పక్కపక్కనే నివాసం ఉండేందుకు ఎంతో బాగుంటుంది కాబట్టి అందరూ ఇళ్లను కొనుక్కోవాలని ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ టౌన్ మళ్లీ జనాభాతో కళకళలాడాలని ఆకాంక్షిస్తోంది. అయితే ఈ ఇళ్లు కొనే ముందు ఒక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

అదేంటంటే కొనుగోలు చేసిన ఇళ్లను మరమత్తులు చేయించుకోవాలి. వాటిని కొత్త ఇళ్లల్లా తీర్చిదిద్దుకోవాలి. తప్పనిసరిగా మూడు సంవత్సరాలలో కొనుగోలు చేసిన ఇళ్లను పునరుద్ధరించాలి. దానితో పాటు ఒప్పందంలో డిపాజిట్‌గా 5,000 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇళ్లు పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన ఇళ్లలో కచ్చితంగా నివసించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఇంటిని పునర్నిర్మాణం చేసి ఎలా ఉపయోగించుకోబోతున్నారో మాత్రం కశ్చితంగా స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి తెలియచేయాలి. వాస్థవానికి ఇటలీలోని గ్రామీన ప్రాంతాల్లో ఈ పధకం మూడేళ్ల క్రితమే ప్రారంభమైంది.

ఇలా ప్రజలు నివసించని నిర్మానుష్యపు ప్రాంతాల్లో ఒకటైన చింక్వా ఫ్రాండీ అనే  ప్రాంతంలోని కాళీ ఇళ్లను కేవలం ఒక్క అమెరికన్‌ డాలరుకే అప్పట్లో అమ్మకానికి పెట్టారు. అలాగే సిసిలియా అనే మరో గ్రామంలోనూ ఇదే తరహాలో ఒక యూరోకే ఇళ్లని విక్రయించడం జరిగింది. మరి ఈ ఆఫర్ ఎంతమంది ప్రజలకి నచ్చుతుందో వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు