ఇంజినీరింగ్‌ చదివి.. అంగన్‌వాడీ టీచర్‌ | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ చదివి.. అంగన్‌వాడీ టీచర్‌

Published Sun, Nov 26 2023 12:58 AM

- - Sakshi

రాయచూరు రూరల్‌: ప్రభుత్వంలో అంగన్‌వాడీ ఉద్యోగం అతి కిందిస్థాయిలో ఉంటుంది. పదో తరగతి పాస్‌ ఈ ఉద్యోగానికి అర్హత. కానీ ఎటుచూసినా విద్యావంతులు పెరిగిపోయి నిరుద్యోగిత తాండవిస్తున్న నేటి రోజుల్లో బీటెక్‌, ఎంబీఏ, ఎంటెక్‌ పట్టభద్రులు కూడా అంగన్‌వాడీ పోస్టులకు ఎగబడుతున్నారు.

శివలీల కథ
చదివింది ఇంజినీరింగ్‌ పట్టా అయినా ఓ యువతి పని చేయడానికి అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగాన్ని ఎంచుకున్న ఘటన కలబుర్గి జిల్లా చించోళిలో జరిగింది. వివరాలు..కలబుర్గి జిల్లా చించోళి తాలూకా భూత్‌పూర్‌లో నివసించే శివలీలా సివిల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తిచేసింది. 2018లో రాయచూరు ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో సివిల్‌ ఇంజినీరింగ్‌ పట్టాను పొందింది. ఆమెకు బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగం రాగా, ఆడపిల్ల అంతదూరం వెళ్లి ఉద్యోగం చేయరాదని కుటుంబసభ్యులు అడ్డుచెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల నియామకాల్లో అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగంలో చేరింది.

బీఈడీ, పీజీ పట్టభద్రులు సైతం
ఒక్క శివలీల మాత్రమే కాదు.. కుంచావరం, ధన్‌సింగ్‌ నాయక్‌ తండాలో ఎంబీఏ బీఈడీ చేసిన మహిళలు కూడా అంగన్‌వాడీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు. హుడేబీరనహళ్లి, చిందానపుర, మళేపూట, తాండా, రుస్తుంపుర, తేగల తెప్ప, రటగల్లో ఎంఎస్‌డబ్ల్యూ పీజీ, మళ్లికోళ్లి తాండాలో బీఎస్సీ బీఈడీ, పోలకపల్లిలో బీకాం చదివిన మహిళలు కూడా ఉండడం విశేషం. చించోళి తాలూకాలో 375 అంగన్‌వాడీ కేంద్రాల్లో 200 మంది మహిళలు ఉన్నత చదువులు చదివిన వారే ఉన్నారని సీడీపీఓ గురుప్రసాద్‌ తెలిపారు. చదువుకు తగిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు లభించకపోవడంతో అంగన్‌వాడీలకు ఎంపికై సరిపెట్టుకోవాల్సి వస్తోందని కొందరు తెలిపారు.

Advertisement
Advertisement