కమల్‌ పార్టీ అభ్యర్థి ఇంట్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం

24 Mar, 2021 02:31 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకున్న సమయంలో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షులు, నటుడు కమల్‌ హాసన్‌కు సన్నిహితుడు, ఆ పార్టీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలుచేశారు. రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చిరాపల్లి కేకే నగర్‌లో నివసించే లేరోన్‌ మొరాయ్సి(45).. సెక్కో ప్రాపర్టీస్‌ పేరున భారీ ఎత్తున రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి ఎంఎన్‌ఎం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

సోమవారం ఐటీ అధికారుల బృందం తిరుచ్చిలోని అతని ఇళ్లు, కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు. మంగళవారం రోజూ సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో రూ.10 కోట్ల నగదు, రూ.కోట్ల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నై పల్లవరం వద్ద వాహన తనిఖీలు చేసున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారం, వెండినగలు పట్టుబడ్డాయి. ఈరోడ్‌లో జరిపిన తనిఖీల ద్వారా 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు