ఉత్తరాఖండ్‌ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు..!

22 Mar, 2021 08:59 IST|Sakshi

అమెరికా భారత్‌ను 200 ఏండ్లు  పాలించింది : ఉత్తరాఖండ్‌ సీఎం

డెహ్రాడూన్‌: మహిళల టోర్న్‌ జీన్స్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్ సీఎం తీరత్‌ సింగ్‌ రావత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను 200 ఏండ్లు అమెరికా పాలించిందని, భారతీయులను  బానిసలుగా చేసిందని, కానీ ఇప్పుడు అమెరికా  కరోనా వైరస్ ని అదుపు చేయలేక సతమతమవుతోందని ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తెలిపారు. రవి అస్తమించని రాజ్యంగానూ పేరుపొందిన  అమెరికా ఇవాళ కొవిడ్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిందంటూ వ్యాఖ్యానించడం వివాదాన్ని రేపింది. స్వయంగా ముఖ్యమంత్రికి బ్రిటన్‌కు అమెరికాకు తేడా తెలియకుండా మాట్లాడటం ఏంటి అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో పూర్తిగా అమెరికా విఫలమైతే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్తంలోని ఇండియా మాత్రం మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేయగలిగిందంటూ ఉత్తరాఖండ్‌ సీఎం మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోని చాలా దేశాలను పాలించిన అమెరికా ప్రస్తుతం కరోనాను అదుపు చేయడంలో తలలు పట్టుకుంటోందని విమర్శించారు. భారత్‌తో పోల్చితే అమెరికాలో కరోనా మరణాల సంఖ్య  50 లక్షల వరకు చేరిందని   చెప్పారు. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని అమెరికా ప్రభుత్వం మరొకసారి  లాక్‌డౌన్ విధించే యోచన చేస్తోందని ఆయన  పేర్కొన్నారు.

ప్రస్తుత సమయంలో  నరేంద్ర మోదీ తప్ప ఈ దేశానికి మరెవరైనా ప్రధాని  అయి ఉంటే, భారత్‌ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని  మోదీ తీసుకున్న చర్యలతో భారత ప్రజలు క్షేమంగా ఉన్నారన్నారు. కానీ ‘కొంతమంది ప్రధాని  ఆదేశాలను మనం పాటించడంలేదని వ్యాఖ్యానించారు. మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి చర్యలను కొందరు మాత్రమే పాటిస్తున్నారు’ అని తీరాత్‌ సింగ్‌ రావత్ అన్నారు.

టోర్న్‌ జీన్స్ వస్త్రధారణపై తీరత్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. సినీ ప్రపంచం, రాజకీయ నేతలు, విద్యార్థినులు, మహిళలు తప్పుబట్టారు. అంతేకాదు,సోషల్‌మీడియాలో నెటిజన్లను ఆయనను తీవ్యంగా దుయ్యబట్టారు. దీంతో  దిగొచ్చిన ఆయన క్షమాపణ తెలిపారు. కానీ మహిళలు జీన్స్ ధరించడం అభ్యంతరం లేదంటూనే చిరిగిన వాటిని ధరించడం సరైంది కాదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. 

(చదవండి: మోదీ ఎప్పుడైనా టీ గార్డెన్‌ను సందర్శించారా?)

మరిన్ని వార్తలు