ఆండ్రాయిడ్‌ ఫోన్లకు మాల్‌వేర్‌ ముప్పు!

31 Jul, 2020 03:34 IST|Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల నుంచి బ్యాంకింగ్‌ తదితర వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేందుకు ‘బ్లాక్‌రాక్‌’ పేరుతో ఓ మాల్‌వేర్‌ చలామణిలో ఉందని సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఒకటి గురువారం హెచ్చరించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోని దాదాపు 337 అప్లికేషన్ల నుంచి ఈ మాల్‌వేర్‌ సమాచారాన్ని సేకరించగలదని, ఈమెయిల్, ఈకామర్స్, సోషల్‌మీడియా, బ్యాంకింగ్‌ ఆప్స్‌ కూడా ఇందులో ఉన్నాయని ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ’క్లుప్తంగా సెర్ట్‌.ఇన్‌ హెచ్చరించింది. ఈ ట్రోజన్‌ వైరస్‌ ఇప్పటికే ప్రపంచమంతా చక్కర్లు కొడుతోందని సెర్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

బ్లాక్‌రాక్‌ను క్సెరెక్స్‌ బ్యాంకింగ్‌ మాల్‌వేర్‌ సోర్స్‌కోడ్‌ ఆధారంగా తయారు చేశారని ఈ క్సెరెక్స్‌ అనేది లోకిబోట్‌ ఆండ్రాయిడ్‌ ట్రోజాన్‌ అని సెర్ట్‌ తెలిపింది. ఈ వైరస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లోకి చొరబడినప్పుడు యాప్‌ డ్రాయర్‌ నుంచి తన ఐకాన్‌ను దాచివేస్తుందని, ఆ తరువాత గూగుల్‌అప్‌డేట్‌ రూపం దాల్చి అనుమతులు కోరుతుందని   వివరించారు. ఒక్కసారి అనుమతులిస్తే..  వినియోగదారుడి ప్రమేయం లేకుండానే సమాచారం లాగేస్తుందని సెర్ట్‌ తెలిపింది.  గుర్తు తెలియని అప్లికేషన్లను డౌన్‌లోడ్‌/ఇన్‌స్టాల్‌ చేసుకోకుండా ఉండటం, అప్లికేషన్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, వినియోగదారుల సమీక్షలను కూడా గమనించి ఒక నిర్ణయం తీసుకోవడం.. అప్లికేషన్లను డౌన్‌లోడ్‌ చేసుకునే ముందు అదనపు సమాచారం ఏముందో తెలుసుకోవడం, తెలియని వైఫై నెట్‌వర్క్‌లకు దూరంగా ఉండటం ద్వారా ఈ మాల్‌వేర్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.

మరిన్ని వార్తలు