అన్నాడీఎంకే మరో ట్విస్ట్‌.. పన్నీరు సెల్వం ప్లాన్‌ ఫలించేనా?

6 Feb, 2023 08:19 IST|Sakshi

తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ తీరుపై ‘పన్నీరు’ ఆగ్రహం 

మళ్లీ మొదటికి రెండాకుల గుర్తు వివాదం

సాక్షి, చెన్నై: సర్వసభ్య సమావేశం సభ్యుల మద్దతు కోసం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ పంపిన దరఖాస్తును ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం శిబిరం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందులో ఏక పక్షంలో అభ్యర్థి పేరును సూచించారని, తమ మద్దతుదారు పేరు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో శనివారం నాటికి 46 మంది నామినేషన్లు వేశారు.ఇందులో కాంగ్రెస్, డీఎండీకే, నామ్‌ తమిళర్‌ కట్చి, అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం అభ్యర్థులు కూడా ఉన్నారు. 

అయితే అన్నాడీఎంకేలో విబేధాల నేపథ్యంలో ఆ పార్టీలోని తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం శిబిరాలకు చెందిన అభ్యర్థులు ఇంత వరకు నామినేషన్లు దాఖలు చేయలేదు. మంగళవారంతో నామినేషన్లు ముగియనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సర్వ సభ్య సమావేశం సభ్యుల మద్దతు సేకరణకు అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ శనివారం చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తును సిద్ధం చేశారు. ఆదివారం రాత్రిలోపు ఈ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సర్వసభ్య సమావేశం సభ్యులకు సమాచారం పంపించారు. మెజారిటీ మద్దతు అనుగుణంగా ఎన్నికల కమిషన్‌ను సోమవారం కలిసేందుకు తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆ దరఖాస్తుకు వ్యతిరేకంగా పన్నీరు సెల్వం శిబిరం ఆదివారం గళం విప్పింది. 

తీవ్ర వ్యతిరేకత.. 
దరఖాస్తును ఏక పక్షంగా సిద్ధం చేశారని పన్నీరు శిబిరం నేతలు బన్రూటి రామచంద్రన్, వైద్యలింగం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ వేస్‌ రోడ్డులోని పన్నీరు సెల్వం ఇంట్లో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ఆ దరఖాస్తులో పళణిస్వామి ప్రకటించిన అభ్యర్థి తెన్నరసు పేరును మాత్రం సూచించారని, తమ అభ్యర్థి పేరును నమోదు చేయలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌ వ్యవహరిస్తున్నారని, ఈ దరఖాస్తును తాము అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాల్సిన చోట ఫిర్యాదు చేస్తామన్నారు. 

ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని సర్వసభ్య సభ్యుల్లో పళనిస్వామి శిబిరానికి 2,662 మంది మద్దతు ఉంది. అలాగే ముగ్గురు ఎంపీలు, 61 మంది ఎమ్మెల్యేలు, 70 మంది జిల్లాల కార్యదర్శుల మద్దతు కూడా ఆయన ప్రకటించిన అభ్యర్థి తెన్నరసుకే ఉండటం గమనార్హం. ఇక, పన్నీరు సెల్వం శిబిరానికి 148 మంది సర్వసభ్య సభ్యులు, ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు , ఐదుగురు జిల్లాల కార్యదర్శుల మద్దతు మాత్రమే ఉండడం గమనార్హం. మద్దతు తక్కువగా ఉన్నా, రెండాకుల వివాదాన్ని మళ్లీ మొదటికి తెచ్చే విధంగా దరఖాస్తును అస్త్రంగా చేసుకుని ఫిర్యాదు చేయడానికి పన్నీరు శిబిరం సిద్ధం అవుతోండడం అన్నాడీఎంకేలో ఆసక్తి రేపుతోంది.

మరిన్ని వార్తలు