పి.సి. మహలనోబిస్‌(1893–1972): సర్వేల శాస్త్రవేత్త

17 Jun, 2022 13:09 IST|Sakshi

గణాంకవేత్త అయిన ప్రశాంత చంద్ర మహలనోబిస్‌ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొత్తగా ఏర్పడిన మంత్రిమండలికి గణాంక సలహాదారుగా నియమితులయ్యారు. 1955లో జాతీయాభివృద్ధి మండలికి రెండో పంచవర్ణ ప్రణాళిక ముసాయిదాను అందించారు. వివిధ దేశాల మధ్య ఆదాయ వ్యత్యాసాలకు ప్రధాన కారణాలు కాగలిగిన అనేక అంశాలను అధ్యయనం చేసిన మహలనోబిస్, ఉక్కు ఉత్పత్తిని చాలా కీలకమైనదిగా నిగ్గు తేల్చారు. దాంతో భారీ పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆయన సిఫార్సు చేశారు. దీని ఫలితంగా భారతదేశ తూర్పు ప్రాంతంలోనూ, మధ్య ప్రాంతంలోనూ ఉక్కు నగరాలు నిర్మాణమయ్యాయి.

మహలనోబిస్‌ అందించిన సేవలలో చిరస్థాయిగా నిలిచిపోయినవి అనేకం ఉన్నాయి. వాటిలో.. భారీ సర్వేలకు ఏర్పాట్లు చేయడం ఒకటి. వివిధ రకాల భారతీయ సమస్యలకు గణాంక సూత్రాలను అనువర్తింప జేయడం మరొకటి. తన జీవితకాలం తర్వాత కూడా వీటి అమలు కొనసాగే విధంగా మహలనోబిస్‌ అందుకు అవసరమైన వ్యవస్థలను నెలకొల్పడం అన్నిటికన్నా ముఖ్యమైనది. మహలనోబిస్‌ ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జిలో గణితం, భౌతిక శాస్త్రం చదివిన తరువాత 1915లో భారతదేశానికి తిరిగి వచ్చి, భౌతిక శాస్త్ర బోధనలో పడిపోయారు. గణాంక విధానాలను ముమ్మరంగా అధ్యయనం చేసిన ఆయన తను పని చేస్తున్న కళాశాలలోనే ఒక చిన్న గణాంక ప్రయోగశాలను ప్రారంభించారు.

అదే కాలక్రమంలో భారతీయ గణాంక సంస్థ (ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌) గా రూపుదిద్దుకుంది. 1933లో ‘సంఖ్య’ అనే పేరుతో ఒక పత్రికను ప్రారంభించారు. 1920లలో కలకత్తాలోని ఆంగ్లో–ఇండియన్‌ వర్గం నుంచి సేకరించిన సమాచారాన్ని వివిధ జాతుల భౌతిక స్థాయిల మధ్య  అంతరాలకు కొలతలుగా ఉపయోగించిన మహలనోబిస్‌కు 1930లలో బెంగాల్‌ మొత్తం మీద జనపనార ఉత్పత్తి అంచనాపై సర్వే చేసే పనిని అప్పగించింది. భారీ స్థాయిలో జరిపిన ఈ సర్వేయే, 1950లో నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌.ఎస్‌.ఎస్‌.) మొదటి విడత కార్యకలాపాలకు రంగాన్ని సిద్ధం చేసింది. నేటికీ ఎన్‌.ఎస్‌.ఎస్‌. కార్యకాలపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆచరణాత్మకమైన ప్రశ్నలకు మహలనోబిస్‌ పెద్ద పీట వేశారు. వాటి లోతుల్ని అన్వేషించారు.

మరిన్ని వార్తలు