దేశవ్యాప్త సమ్మె పాక్షికం

29 Mar, 2022 04:57 IST|Sakshi
కోల్‌కతాలో రైల్‌రోకోలో పాల్గొన్న కార్మికులు

పలు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన రెండురోజుల దేశవ్యాప్త సమ్మె సోమవారం ప్రారంభమయ్యింది. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్, ప్రజా రవాణా వ్యవస్థ సేవలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సమ్మె పాక్షికంగా విజయవంతమయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగాయి. అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదు.

సానుకూల స్పందన: ఏఐటీయూసీ
దేశవ్యాప్త సమ్మెలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్, యూటీయూసీ తదితర జాతీయ కార్మిక సంఘాలు పాలుపంచుకున్నాయి. సమ్మెకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని ఆలిండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్‌ కౌర్‌ తెలిపారు. అస్సాం, హరియాణా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బిహార్, పంజాబ్, రాజస్తాన్, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సమ్మెకు ప్రజలు మద్దతు తెలిపారని వెల్లడించారు. దేశవ్యాప్త సమ్మె మంగళవారం కూడా కొనసాగనుంది. లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు