బడ్జెట్‌ 2021‌: పదేళ్ల మెగా ప్రణాళిక

2 Feb, 2021 08:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా అన్ని రవాణా వ్యవస్థలతో పాటు భారతీయ రైల్వేపైనా పెను ప్రభావం చూపించింది. కొన్ని నెలల పాటు రైళ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో.. రైల్వే కోసం 2021–22 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ.1,10,055 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రూ.1,07,100 కోట్లు మూలధన వ్యయంగా పేర్కొన్నారు. ‘రికార్డు’బడ్జెట్‌గా అభివర్ణించినా 2020–21 సవరించిన బడ్జెట్‌ (రూ.1.11 లక్షల కోట్లు) కంటే ఇది తక్కువే. మరోవైపు 2030 కల్లా భవిష్యత్‌ అవసరాలకు తగిన (ఫ్యూచర్‌ రెడీ) రైల్వే వ్యవస్థను సృష్టించడం ప్రధాన లక్ష్యంగా భారత జాతీయ రైలు ప్రణాళిక 2030కి రూపకల్పన చేశారు.

ఇందులో భాగంగా.. మేక్‌ ఇన్‌ ఇండియా వ్యూహానికి ఊతం ఇచ్చేలా పరిశ్రమల రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా.. 2022 జూన్‌ కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు (డీఎఫ్‌సీ) ప్రారంభించాలని నిర్ణయించారు. ఈడీఎఫ్‌సీలో భాగంగా 2021–22లో సోన్‌నగర్‌–గోమోహ్‌ సెక్షన్‌ను పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)లో చేపడతారు. ఆ తర్వాత గోమోహ్‌–డాంకుని సెక్షన్‌ చేపడతారు. భవిష్యత్తులో ఖరగ్‌పూర్‌ – విజయవాడ ఈస్ట్‌ కోస్ట్‌ కారిడార్‌ను, భూసావాల్‌ – ఖరగ్‌పూర్‌ – డాంకుని ఈస్ట్‌ వెస్ట్‌ కారిడార్, అలాగే ఇటార్సీ – విజయవాడ నార్త్‌ సౌత్‌ కారిడార్‌ను చేపడతారు.    

   2022 జూన్‌కల్లా తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు
   భవిష్యత్తులో ఖరగ్‌పూర్‌ – విజయవాడ ఈస్ట్‌ కోస్ట్‌ కారిడార్, ఇటార్సీ – విజయవాడ నార్త్‌ సౌత్‌ కారిడార్, భూసావాల్‌–ఖరగ్‌పూర్‌–డాంకుని ఈస్ట్‌ వెస్ట్‌ కారిడార్‌లు 
 2023 కల్లా బ్రాడ్‌గేజ్‌ రూట్ల 100 శాతం విద్యుదీకరణ 
   రైళ్ల ప్రమాదాల నివారణకు ఆటోమేటిక్‌ రైలు భద్రత విధానం 

2020 అక్టోబర్‌ 1 నాటికి 41,548 రూట్‌ కిలోమీటర్లు (ఆర్‌కేఎం)గా ఉన్న బ్రాడ్‌ గేజ్‌ రూట్‌ విద్యుద్దీకరణ 2021 చివరి నాటికి 46,000 రూట్‌ కిలోమీటర్లకు (72%)చేరుకుంటుంది. 2023 కల్లా 100% విద్యుద్దీకరణ పూర్తవుతుంది. పర్యాటక రూట్లలో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాలకు వీలుగా ఆకర్షణీయంగా డిజైన్‌ చేసిన విస్టా డోమ్‌ ఎల్‌హెచ్‌బీ రైల్వే కోచ్‌లను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు భద్రత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ‘మానవ తప్పిదాల కారణంగా రైళ్లు ఢీకొనడం వంటి ప్రమాదాలు నివారించేందుకు దేశీయంగా డిజైన్‌ చేసిన ఆటోమేటిక్‌ వ్యవస్థను అన్ని ప్రధానమైన రూట్లలో ప్రవేశపెడతాం..’అని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 
ప్రయాణికుల భద్రత, సౌకర్యాలపై దృష్టి

మెట్రో రైళ్ల విస్తరణలో భాగంగా చెన్నై మెట్రో రైల్వే ఫేజ్‌–2 కోసం రూ.63,246 కోట్ల కేంద్ర నిధులు కేటాయించారు. బెంగళూరు మెట్రో రైల్వే ఫేజ్‌ 2ఏ, 2బీ కోసం రూ.14,788 కోట్లు, కొచ్చి మెట్రో రైల్వే ఫేజ్‌–2 కోసం 1,957.05 కోట్లు, నాగ్‌పూర్‌ మెట్రో రైల్వే ఫేజ్‌–2 కోసం రూ.5,976 కోట్లు, నాసిక్‌ మెట్రో కోసం రూ.2,092 కోట్లు ప్రకటించారు. సోమవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా.. లాక్‌డౌన్‌ సమయంలో దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకులు సరఫరా చేసిన రైల్వేని ఆర్థికమంత్రి అభినందించారు. ఇది పూర్తిగా భిన్నమైన, పరివర్తనతో కూడిన బడ్జెట్‌గా రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓ సునీశ్‌ శర్మ అభివర్ణించారు.

మరిన్ని వార్తలు