కరోనాతో ‘చిప్కో’ సుందర్‌లాల్‌ బహుగుణ మృతి

21 May, 2021 13:51 IST|Sakshi

తెహ్రీ డ్యామ్‌: ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ బహుగుణ కరోనాతో కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కొవిడ్‌ బారినపడ్డ బహుగుణ..  రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు(శుక్రవారం) కన్నుమూసినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. గతకొంతకాలంగా హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన పోరాడుతున్నారు. ఎనభైవ దశకంలో తెహ్రీ డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా ఆయన అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. 1981లో పద్మశ్రీ, 2009లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. 

చెట్లను నరికివేయొద్దనే నినాదంతో ఆయన చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్టు, పర్యావరణం, మానవ సమాజం అంటూ అందరికీ అర్థమయ్యే రీతిలో చిప్కో ఉద్యమాన్ని చేపట్టారు. హిందీలో చిప్కో అంటే కౌగిలించుకోవడం అని అర్థం.  సుందర్‌లాల్‌ బహుగుణ లాంటి పర్యావరణవేత్తను కోల్పోవడం ఈ దేశానికి లోటని పర్యావరణవేత్తలు విచారం వ్యక్తం చేశారు. సుందర్‌లాల్ బహుగుణ 1927 జనవరి 9 న ఉత్తరాఖండ్ లోని తెహ్రీ సమీపంలో ఉన్న మరోడా గ్రామంలో జన్మించారు. వృక్షాలే కాదు.. అంతరించిపోతున్న జంతు, పక్షి జాతుల పరిరక్షణ కోసం కడ దాకా పరితపించారాయన. 

మరిన్ని వార్తలు