కరోనా: అణ్వాయుధాల కంటే భారీ నష్టం మిగిల్చింది

1 Jun, 2021 15:26 IST|Sakshi

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మూలాల గురించి తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటే మరో పక్క కొందరు ప్రముఖులు మాత్రం ఆ సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరని నమ్ముతున్నారు. తాజాగా ఆ జాబితాలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేరారు. మే 30న, డైలీ మెయిల్ లో వచ్చిన ఒక కథనంలో ఈ మహమ్మారి విలయానికి చైనానే కారణమని, ఈ వైరస్‌ను ఆ దేశ శాస్త్రవేత్తలే ల్యాబ్‌లో సృష్టించినట్లు బలం చేకూర్చే అధ్యయనం ఒకటి తాజాగా వెలువడిన విషయం తెలిసిందే. చైనా శాస్త్రవేత్తలు కోవిడ్ వైరస్‌ను వుహాన్ ప్రయోగశాలలో సృష్టించారని, ఆపై "వైరస్ రివర్స్-ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా వారి తప్పును కప్పిపుచ్చడానికి గబ్బిలాల నుంచి సహజంగా ఉద్భవించినట్లు కనిపించేలా చేసినట్లు" ఆ నివేదిక పేర్కొంది.

ఈ కథనం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కథనంపై స్పందిస్తూ ఆనంద్ మహీంద్రా మే 31న ఇలా వ్రాశారు.. "మనం ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేము కానీ వాస్తవం ఏమిటంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం లాగే జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక(నాన్-ప్రొలిఫరేషన్) ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.  కోవిడ్ వైరస్‌ ఇప్పటికే యావత్‌ ప్రపంచానికి అణ్వాయుధం కంటే ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది’’ అని మహీంద్రా ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు కరోనా మహమ్మారి వల్ల 35.65 లక్షలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక సంఖ్యలో ప్రజలు మరణించగా, 3లక్షల పైచిలుకు మరణాలతో భారత్‌ రెండోస్థానంలో ఉంది. ఏప్రిల్ నుంచి భారీగా పెరిగిన కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతుంది. కొద్దీ రోజుల క్రితమే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా మూలాలను 90  రోజుల్లోగా కనిపెట్టాలని ఆ దేశ నిఘా బృందాన్ని హెచ్చరించారు. ఈ కరోనా మహమ్మరి కారణంగా అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థలు కూలిపోయాయి.

చదవండి: బ్లాక్‌ ఫంగస్‌కు హైదరాబాద్‌ సెలాన్‌ ఔషధం

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు