అమ్మవారి పల్లకి ముట్టుకున్నందుకు..60 వేలు జరిమాన

21 Sep, 2022 09:00 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న బాలుని తల్లి

మాలూరు: గ్రామాల్లో ఇప్పటికీ అస్పృశ్యత అనే రక్కసి వెంటాడుతోంది. ఇందుకు నిదర్శనమే ఈ ఉదంతం. దళిత బాలుడు అమ్మవారి పల్లకీని ముట్టుకున్నాడని గ్రామస్తులు అతని కుటుంబానికి రూ.60 వేల జరిమానా విధించారు. డబ్బు కట్టకపోతే అక్టోబర్‌ 1 లోగా గ్రామం విడిచి వెళ్లాలని హుకుం జారీచేశారు. ఈ అమానవీయ సంఘటన కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని ఉళ్లేరహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.  

ఉళ్లేరహళ్లి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న దళిత బాలుడు చేతన్‌ ఈ నెల 8వ తేదీన బూత్యమ్మ జాతరలో అమ్మవారి పల్లకీని తాకాడు. ఇది చూసి అగ్రవర్ణాల వారు బాలున్ని మందలించి కొట్టారు. అంతటితో ఆగకుండా పంచాయతీ పెట్టారు. బాలుడు ముట్టుకోవడం వల్ల మైలపడిందని, ఇందుకు శాంతి కార్యక్రమం చేయడానికి రూ.60 వేలు కట్టాలని బాలుని తల్లి శోభను ఆదేశించారు.  

పోలీసులకు తల్లి ఫిర్యాదు  
దీంతో భయపడిన శోభ సోమవారం మాస్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేట్టారు. పలు దళిత సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాయి.  గ్రామ పంచాయతీ మాజీ సభ్యుడు నారాయణస్వామి, రమే‹Ù, వెంకటేశప్ప, నారాయణస్వామి, కొట్టప్ప, అర్చకుడు మోహన్‌రావ్, చిన్నయ్యలతో పాటు మరికొందరిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. 

(చదవండి: విధి వంచితురాలు)

మరిన్ని వార్తలు