ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కీలక నిర్ణయం

9 Nov, 2020 09:10 IST|Sakshi

ముంబై శివారుల్లో ఆక్రమణలపై ఎమ్మెమ్మార్డీఏ ఉక్కుపాదం 

ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా సెక్యూరిటీ 

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక నగరం ముంబైతోపాటు ఉప నగరాలలో, శివారు ప్రాంతాల్లో ఉన్న స్థలాలు, ఇతర ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించాలని ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయం తీసుకుంది. మూడు సంవత్సరాల కాలవ్యవధి కోసం సంబంధిత కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వనుంది. సుమారు 400పైగా సెక్క్యురిటీ గార్డులతో కూడిన బృందాన్ని రంగంలోకి దించనుంది. అందుకు ఎమ్మెమ్మార్డీయే సుమారు రూ.40 కోట్లు ఖర్చు చేయనుందని అథారిటీ వర్గాలు తెలిపాయి.   (మహారాష్ట్రలో జైళ్లు ఫుల్‌)

4,350 చదరపు కిలోమీటర్లు.. 
ఎమ్మెమ్మార్డీయే పరిధి సుమారు 4,350 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో ముంబై, థానే, నవీముంబై, కల్యాణ్‌–డోంబివలి, ఉల్లాస్‌నగర్, మీరా–భాయందర్, భివండీ, వసయి–విరార్‌ తదితర కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే అంబర్‌నాథ్, బద్లాపూర్, మాథేరాన్, కర్జత్, ఖోపోలి, పన్వేల్, పేణ్, ఉరణ్, అలీబాగ్‌ తదితర మున్సిపాలిటీలు, వీటి పరిధిలోని కొన్ని గ్రామాలున్నాయి. ముంబైలో బాంద్రా–కుర్లా–కాంప్లెక్స్‌ (బీకేసీ), వడాల, ఓషివరా, గోరాయి తదితర ప్రాంతాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు విలువచేసే సొంత స్థలాలున్నాయి. వీటిపై నియంత్రణ లేకపోవడంవల్ల ఈ స్థలాలన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేక రోజురోజుకు అక్రమణ పెరిగిపోతూనే ఉంది. అందుకు ప్రధాన కారణం ట్రాఫిక్‌ వ్యవస్థపై ఎమ్మెమ్మార్డీయే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడమే.

నగరంతోపాటు ఉప నగరాలు, శివారు ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా అక్కడక్కడ ఫ్లై ఓవర్లు, మెట్రో–2, 3, 4, 5 ప్రాజెక్టులున్నాయి. అథారిటీ అధికారులెవరు సొంత స్థలాలపై దృష్టి సారించడం లేదు. దీంతో ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారు. అక్రమణలను తొలగించాలంటే ఎమ్మెమ్మార్డీయే చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. తమ స్థలాలు సొంతం చేసుకునేందుకు బలవంతంగా అక్రమణలు తొలగిస్తే కోర్టులు, స్టే ఆర్డర్లు, పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు, బాధితుల నుంచి దాడులు, ఆందోళనలు, రాస్తారోకోలు ఇలా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అంతేగాకుండా అక్రమణల కారణంగా ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతోంది. ఆలస్యంగానైన కళ్లు తెరిచిన అథారిటీ ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించి కనీసం మిగిలిన స్థలాలను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తోంది. 

చదవండి: ముంబైలో బైడెన్‌ బంధువులు..!

మరిన్ని వార్తలు