బెంగళూరులో కుండపోత

11 Sep, 2020 08:35 IST|Sakshi

బెంగుళూరు: నైరుతి రుతుపవనాల ప్రభావంలో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. వాతావరణ శాఖ మలెనాడు, కరావళిలో ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. రాజధాని బెంగళూరులో బుదవారం సాయంత్రం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 85 మిల్లీమీటర్ల వర్షపాతం సంభవించింది.లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మంగళ, బుధవారం రాత్రి కురిసిన కుంభవృష్టికి బెంగళూరులో 40కి పైగా వార్డులు అతలాకుతలమయ్యాయి.

డ్రైనేజీలు పొంగిపొర్లి ప్రముఖ రోడ్లు మురికిగుంతలుగా మారిపోయాయి. నాయండహళ్లి సమీపంలోని రాజకాలువ అడ్డుగోడ కొట్టుకుపోవడంతో ప్రమోద్‌ లేఔట్‌లో 25కు పైగా ఇళ్లలోకి మురుగునీరు చొరబడింది. అపార్టుమెంట్ల సెల్లార్లలోని వందలాది వాహనాలు నీటమునిగాయి. చిత్రదుర్గలో ట్రాక్టర్‌ కొట్టుకుపోగా అందులో ఉన్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. జిల్లాలోని జాజూరులో ఇల్లు కూలిపోయి ఓ పసికందు మృత్యువాత పడగా పసికందు అన్న, తల్లిదండ్రులకు స్వల్పగాయాలయ్యాయి. మైసూరు తాలూకా హుయిలాళు గ్రామంలో ఒక ఇల్లు కూలింది.
 
ఇళ్లు జలమయం, తీవ్ర నష్టం
బెంగళూరులో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో 5 అడుగులకు పైగా నీరు నిలిచిపోవడంతో ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు వంటి విలువైన సామగ్రి నాశనమైంది. రాజరాజేశ్వరినగర ఐడియల్‌ హోమ్స్, కెంచనహళ్లి, జనప్రియ ఎబోర్డ్, మైలసంద్ర, తదితర లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వాననీరు చొరబడింది. బీబీఎంపీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని బాధితులు మండిపడ్డారు. హెబ్బాళ, కొడిగేహళ్లి, చుట్టుపక్కల అండర్‌పాస్‌లు నీటమునిగాయి. అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డుకు అనుసంధానంగా ఉన్న వంతెనలు నీటమునగడంతో వాహనదారులు ఇరుక్కుపోయారు. కొడిగేహళ్లి సమీపంలోని తిండ్లు, విద్యారణ్యపుర మధ్య ఉండే వంతెనను అశాస్త్రీయంగా నిర్మించడమే దీనికి కారణమని ప్రజలు ఆరోపించారు.  

మాగడి రోడ్డు, విజయనగర, అగ్రహార దాసరహళ్లి, హెబ్బాల, మూడలపాళ్య, హెణ్ణూరు, హొరమావు, హుళిమావు, హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ ప్రాంతాల్లో వర్షబీభత్సం అధికంగా ఉంది. చుట్టుపక్కల రాజ కాలువలు పొంగిపొర్లడంతో మురుగునీరు నిలిచిపోయి ప్రజలు బయటకు రాలేకపోయారు. మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్‌ను ప్రకటించింది.

చదవండి: ఆ రెండు రాష్ట్రాలలో భారీ వర్షాలు!

మరిన్ని వార్తలు