Karnataka Hijab Row: హిజాబ్‌ వివాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

8 Feb, 2022 17:04 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: హిజాబ్‌ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు, కాలేజీలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.  ఈ మేరకు సీఎం బసవరాజ్‌ బొమ్మై ట్విటర్‌లో స్పందించారు. రాష్ట్రంలో శాంతిని కాపాడాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల, కళాశాల యాజమాన్యంతోపాటు రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అన్ని హైస్కూల్స్, కాలేజీలను మూసివేయాలని ఆదేశించినట్లు, ఇందుకు అందరూ సహకరించాలని కోరారు.

కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హిజాబ్‌ వివాదంపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో భావోద్వేగాలకు తావులేదని వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం, రాజ్యాంగ బద్దంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తమకు రాజ్యాంగమే భగవద్గీత అని తెలిపిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
చదవండి: కర్ణాటకలో ‘హిజాబ్‌’పై అదే రగడ

ముదురుతున్న హిజాబ్‌ వివాదం
కర్ణాటకలో హిజాబ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై కర్ణాటకలోని రెండు జిల్లాల్లో మంగళవారం హింసాత్మకంగా మారింది. ఉడిపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ కాలేజీలో మంగళవారం కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు, హిజాబ్‌లు ధరించిన విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగడంతో నిరసనలు చెలరేగాయి.

హిజాబ్ ధరించి ఓ విద్యార్థిని కాలేజ్‌కు వస్తుండగా కాషాయ కండువాలు ధరించిన మరొక వర్గం విద్యార్థులు అడ్డుకున్నారు. యువతి తన స్కూటర్‌ను పార్క్ చేసి కళాశాల భవనం వైపు వెళుతుండగా.. ఆమెకు వ్యతిరేకంగా కాషాయ కండువాలు ధరించిన వర్గం జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. వీరికి ధీటుగా ఆ విద్యార్థిని ‘అల్లా హు అక్బర్‌’ అంటూ నినదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు