వారిని వదిలేస్తే.. మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్ణం: రాహుల్ గాంధీ

20 Sep, 2023 18:23 IST|Sakshi

ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు అసంపూర్తిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలను బీజేపీ గాలికొదిలేస్తోందని ఆరోపించారు. ఇప్పుడున్న వ్యవస్థలో ఓబీసీలకు ప్రభుత్వం ఏం ప్రాధాన్యత ఇస్తుందో చెప్పాలని కేంద్రాన్ని రాహుల్ ప్రశ్నించారు. మహిళా బిల్లులో ఓబీసీ ప్రస్తావనే లేదని అన్నారు.

మద్దతు ఇస్తున్నాం.. కానీ:
మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాను మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్న రాహుల్ గాంధీ.. కుల గణన చేపట్టి అత్యధిక జనాభా ఉన్న వర్గాలవారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి మారేప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఆహ్వానించకపోవడంపై రాహుల్ ప్రశ్నించారు. 

90లో ముగ్గురు మాత్రమే..
కేంద్ర ప్రభుత్వానికి చెందిన 90 సెక్రటరీల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ జాబితాలో ఉన్నారని రాహుల్ చెప్పారు. బడ్జెట్‌లో కేవలం 5 శాతం మాత్రమే  వారి ఆధీనంలో ఉందని అన్నారు. కుల గణన చేయడంతోపాటు మహిళా బిల్లులో ఓబీసీలకు ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. 

తక్షణమే అమలు చేయండి..
పంచాయతీ రాజ్ వ్యవస్థే మహిళలకు అధికారం ఇచ్చిందని, అన్నాళ్ల తర్వాత ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ బిల్లు మరో కీలక పరిణామం అని ఆయన అన్నారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి తీసుకురావడంపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నేటి నుంచి ఈ బిల్లు అమలులోకి రావాలని డిమాండ్ చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని అన్నారు. 

ఇదీ చదవండి: కొత్త పార్లమెంటులో లోక్‌సభ  స్పీకర్ స్థానంలో కూర్చున్న తొలి తెలుగు ఎంపీగా మిథున్ రెడ్డి రికార్డు.

మరిన్ని వార్తలు