రూ.90 లక్షల ప్లాట్‌ కొని.. సొరంగం తవ్వి!

27 Feb, 2021 14:29 IST|Sakshi

రాజస్తాన్‌లో వెలుగు చూసిన ఘటన

జైపూర్‌: దొంగతనం చేసేవాడు తన పనికి అవసరమొచ్చే వస్తువులు కొనుగోలు చేస్తాడు. కానీ ఈ దొంగలు మాత్రం ఓ డాక్టర్‌ ఇంట్లో దొంగతనం చేయడం కోసం ఏకంగా 90 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ ప్లాట్‌ కొనుగోలు చేశారు. ఇంత ఖర్చు పెట్టారంటే ఆ డాక్టర్‌ ఇంట్లో ఎంత విలువైన నిధి నిక్షేపాలు ఉన్నాయో అని భావిస్తే.. తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇక్కడ దొంగలు అపహరించింది వెండిని. 

వెండి దొంగతనం చేయడం కోసం ఇంత ఖర్చు పెట్టి ప్లాట్‌ కొనడం ఏంటి.. అసలు ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. రాజస్తాన్జైపూర్‌ వైశాలి నగర్‌ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ సునీత్‌ సోని ఇంటిలో రెండు రోజుల క్రితం భారీ దొంగతనం జరిగింది. తన ఇంట్లో ఓ పెట్టె నిండా ఉన్న వెండిని అపహరించారు దొంగలు. ఇంటి నిండా సీసీ కెమరాలు.. ఫుల్‌ సెక్యూరిటి ఉన్నప్పటికి ఈ దొంగతనం ఎలా జరిగిందో అతడికి అంతుబట్టలేదు. దాంతో ఓ సారి తన ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. 

తన ఇంటి బేస్‌మెంట్‌లో ఓ పెద్ద సొరంగం కనిపించింది. దాని గుండా నడుచుకుంటు వెళ్తే తన ఎదురు ప్లాట్‌ వచ్చింది. దాంతో తన ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో క్లియర్‌గా అర్థం అ‍య్యింది డాక్టర్‌కి. దొంగలు తన ఇంట్లో ఉన్న వెండిని కాజేయడానికి తన ఇంటి ఎదురుగా ఉన్న ప్లాట్‌ బేస్‌మెంట్‌ నుంచి తన ఇంటి వరకు సొరంగం తవ్వారు. దాని గుండా తన ఇంట్లో ప్రవేశించి.. చోరికి పాల్పడ్డారు. 

దీని గురించి డాక్టర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం డాక్టర్‌ ఇంట్లో ఉన్న వెండిని కాజేయడం కోసమే దొంగలు అతడి ఇంటికి ఎదురుగా ఉన్న ప్లాట్‌ని 90 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారని తెలిసింది. మూడు నెలల క్రితం ప్లాట్‌ కొనుగోలు చేసిన దొంగలు నాటి నుంచి సొరంగం తవ్వడం మొదలు పెట్టారని వెల్లడించారు. ఇక డాక్టర్‌ ఇంట్లో ఉన్న వెండి గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ దొంగతనం వెనక ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

చదవండి: 
పాక్‌ కుట్ర.. భారత్‌లోకి 150 మీటర్ల సొరంగం!
ఆల్రెడీ పెళ్లైన ప్రేయసి ఇంటికి సొరంగం

>
మరిన్ని వార్తలు