ఏసీబీ నత్తనడక 

26 Feb, 2021 10:00 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఏసీబీ అలసత్వం వహిస్తోందని విమర్శలను మూటగట్టుకుంటోంది. అవినీతిపరులకు వణుకు పుట్టించి ప్రజలకు భరోసానివ్వాల్సిన ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కోరల్లేని పాముగా మారుతోంది. గడిచిన ఐదేళ్లలో 1,445 లంచం, అక్రమ సంపాదన కేసులు నమోదు చేసి, కేవలం నలుగురిని మాత్రమే దోషులుగా తేల్చగలిగింది. దీంతో ఏసీబీ పనితీరు, వేగంపై ప్రస్తుతం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఆదాయానికి మించి అక్రమాస్తులను సంపాదించడంపై 2016 నుంచి  మొత్తం 186 మంది ప్రభుత్వ సిబ్బందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అలాగే లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలపై మరో 957 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు చేసింది. ఇందులో కేవలం నాలుగు కేసుల్లోనే ఏసీబీ అభియోగాలను రుజువు చేసి దోషులకు శిక్ష పడేలా చేయగలిగినట్లు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాటం సాగిస్తున్న కర్ణాటక రాష్ట్ర సమితి వెల్లడించింది.  

కావాలనే కేసుల మూసివేత  
కొంత మంది సీనియర్‌ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లపై వచ్చిన ఫిర్యాదులను, సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ ఏసీబీ కావాలనే మూసేసినట్లు సమితి ఆరోపించింది. ఏసీబీ స్వయంగా దాడులు చేసి ప్రత్యక్షంగా లంచాలు తీసుకుంటుండగా పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగుల కేసుల్లోనూ నిందితులకు శిక్ష పడేలా చేయడంలో ఏసీబీ విఫలం అయిందని పేర్కొంది.  

బాగా పనిచేస్తున్నాం:ఏసీబీ  
ఈ వాదనను ఏసీబీ తోసిపుచ్చుతోంది. ఇప్పటివరకు 1,568 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 1,541 మంది ప్రభుత్వ అదికారులను ఆయా కేసుల్లో అరెస్టు చేసినట్లు, వీరిలో 1,199 మంది సస్పెన్షన్‌కు గురయ్యారని వెల్లడించారు. 940 మంది అధికారులపై ఏసీబీ దర్యాప్తునకు సూచనలు చేసినట్లు తెలిపారు. 815 ఎఫ్‌ఐఆర్‌లల్లో చార్జ్‌ïÙట్‌ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ కేసులన్నీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 35 ప్రత్యేక కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు