తమిళనాడును రెండుగా విభజించలేం: కేంద్రం

4 Aug, 2021 15:24 IST|Sakshi
ఎంపీలు పారివేందర్, రామలింగం ప్రశ్నకు సమాధాన ఇస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌

ఢిల్లీకి చేరిన కొంగునాడు గొడవ 

చీల్చబోమన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ 

సాక్షి, చెన్నై: తమిళనాడును రెండు ముక్కలు చేయాలనే ఉద్దేశం, ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ స్పష్టం చేశారు.  ఈ ప్రకటనతో కొంగునాడు గొడవకు ముగింపు పలికినట్టు అయింది. పరిపాలనా సౌలభ్యం నిమిత్తం చెన్నైకు ప్రత్యామ్నాయంగా మదురై కేంద్రంగా మరో రాజధాని అవశ్యం అంటూ, దక్షిణ తమిళనాడు కేంద్రంగా మరో రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందే అన్న నినాదాలు తరచూ తెరపైకి రావడం జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు, తిరుప్పూర్, సేలం, ఈరోడ్‌ జిల్లాలతో నిండిన కొంగునాడులో డీఎంకే పార్టీ ప్రభావం తక్కువే. మొదటి నుంచి ఇది అన్నాడీఎంకేకు కంచుకోటే. ఈ పరిణామాల నేపథ్యంలో కొంగునాడు నినాదం తెరపైకి కొన్ని నెలల క్రితం వచ్చింది. తమిళనాడు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడం లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ వర్గాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు, అక్కడి పెద్దలు దీనిపై పరిశీలన జరుపుతున్నట్టు తెలిసింది. కోయంబత్తూరు కేంద్రంగా కొత్త రాష్ట్రం ఏర్పాటు కాబోతున్నట్టు, తమిళనాడును చీల్చేందుకు కేంద్రం దూకుడు పెంచినట్టుగా చర్చ, ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో మంగళవారం వ్యవహారం పార్లమెంట్‌కు  చేరింది. 

ప్రస్తుతానికి నో.. 
ఎంపీలు పారివేందర్, రామలింగం లిఖిత పూర్వకంగా పార్లమెంట్‌ దృష్టికి తమిళనాడు చీలిక వ్యవహారం, కొంగునాడు ఏర్పాటు ప్రస్తావనను తీసుకెళ్లారు. తమిళనాడును రెండు ముక్కలు చేసే విధంగా స్పష్టమైన సమాధానం తమకు ఇవ్వాలని పట్టుబట్టారు. ఇందుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ సమాధానం ఇచ్చారు. తమిళనాడును రెండు రాష్ట్రాలు చేయడం, కొంగునాడు ఏర్పాటుపై ఎలాంటి పరిశీలన ప్రస్తుతం తమ వద్ద లేదని స్పష్టం చేశారు. దీంతో చాలా రోజుల నుంచి రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న కొంగునాడు ప్రస్తావనకు ముగింపు పలికినట్లు అయ్యింది. అయితే ప్రస్తుతానికి పరిశీలన లేకున్నా, భవిష్యత్తులో కేంద్రం దృష్టి పెట్టి తీరుతుందన్న వాదనలు తెరపైకి రావడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు