ఆన్‌లాక్‌-4: తెరుచుకున్న మధుర మీనాక్షి ఆలయం

1 Sep, 2020 16:43 IST|Sakshi

మదురై : కరోనా వైరస్‌ నేపథ్యంలో మూతపడిన మదురైలోని మీనాక్షి అమ్మన్‌ ఆలయం 165 రోజుల తర్వాత మంగళవారం తిరిగి తెరుచుకుంది. ఆన్‌లాక్‌-4 ప్రక్రియలో భాగంగా కొత్త సడలింపులతో భక్తులను పునఃదర్శనానికి అనుమతిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తొలిరోజే భక్తులు భారీగా తరలి వచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలోకి భక్తులను అనుమతించేముందు ఆలయ సిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి భక్తుల చేతులకు శానిటైజర్‌ అందింస్తున్నారు. ముఖానికి మాస్కు లేకుంటే ఆలయంలోకి అనుమతిని నిషేధిస్తున్నారు. (వ‌చ్చే నెల‌లో తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు)

ఉదయం 6 గంటల నుంచి 12.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు భక్తులకు దర్శనాన్ని అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 10 సంత్సరాలలోపు పిల్లలను, గర్భిణులను, 60 ఏళ్లు పైబడిన వారిని ఆలయ సందర్శనానికి అనుమతించడం లేదన్నారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యగా భక్తులకు ఎలాంటి ఆహార పదార్థాలు అందించడం లేదని తెలిపారు. అలాగే కొబ్బరికాయలు, పండ్లు, దండలు ఆలయంలోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు. అయితే కొన్ని నెలల తరువాత అమ్మవారిని దర్శించుకోవడపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు