అమానుషం: పోలీసుల ముందే పాశవిక దాడి!

1 Aug, 2020 08:27 IST|Sakshi

చండీఘర్‌: దేశ రాజధాని సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. గోమాంసాన్ని తరలిస్తున్నాడనే అనుమానంతో గురుగ్రామ్‌లో కొంతమంది ఓ ట్రక్కు డ్రైవర్‌పై విరుచుకుపడ్డారు. సుత్తెతో బాదుతూ తీవ్రంగా హింసించారు. పోలీసుల ముందే రెచ్చిపోతూ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. లక్మన్‌ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం బాద్‌షాపూర్‌ నుంచి మాంసం(గేదె) లోడ్‌తో బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న గోరక్షక బృందం అతడిని వెంబడించింది. 

ఈ క్రమంలో 9 గంటల సమయంలో గురుగ్రామ్‌లో ట్రక్కును ఆపేసిన గోరక్షకులు లక్మన్‌ను కిందకు లాగి, గోమాంసం తరలిస్తున్నాడనే అనుమానంతో అతడిని తీవ్రంగా కొట్టారు. కిందపడేసి తన్నుతూ సుత్తెతో బాదారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, తొలుత మాంసాన్ని ల్యాబ్‌కు పంపించే పనిలో పడ్డారే తప్ప.. బాధితుడిని రక్షించే ప్రయత్నం చేయలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. లక్మన్‌ను తమ గ్రామమై బాద్‌షాపూర్‌కు తీసుకువెళ్లేందుకు దుండగులు ప్రయత్నించగా.. అప్పుడు రంగప్రవేశం చేశారని.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపారు. (దారుణం: కల్తీ మద్యం తాగి 24 మంది మృతి)

ఇక ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులను సంప్రదించగా... స్పందించేందుకు వారు నిరాకరించారని ఓ జాతీయ మీడియా పేర్కొంది. లక్మన్‌పై దాడి చేసిన దుండగుల ముఖం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. కాగా ఈ విషయం గురించి ట్రక్కు యజమాని మాట్లాడుతూ.. యాభై ఏళ్లుగా తాను మాంసాన్ని విక్రయిస్తున్నానని, తమ వాహనంలో ఉన్నది గేదె మాంసమని వివరణ ఇచ్చారు.    

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా