ఆయన ఆషామాషీ వ్యక్తి కాదు.. లిక్కర్‌ స్కాంలో సిసోడియాకు గట్టి దెబ్బ

30 May, 2023 11:58 IST|Sakshi

ఢిల్లీ: ఆప్‌ కీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాకు గట్టి దెబ్బే తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ వెంటనే ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్‌ పాలసీ స్కాంలో సీబీఐ ఆయన్ని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

మనీష్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి, కాబ్టటి బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు బెంచ్‌ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అనవసర ప్రయోజనాల కోసం కుట్ర పూరితంగా ఆ ఎక్సైజ్ పాలసీని రూపొందించారంటూ తీవ్ర వ్యాఖ్యలే చేసింది న్యాయస్థానం.

👉ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆషామాషీ వ్యక్తి కాదు. అరెస్ట్‌ సమయానికి మంత్రిగా ఉన్నారు. పైగా 18 శాఖల నిర్వహణను చూసుకున్నారు. అలాంటి వ్యక్తి  బయటకు వస్తే సాక్ష్యులను ప్రలోభ పెట్టి.. ఆధారాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు అంటూ హైకోర్టు సిసోడియా బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించింది.

లిక్కర్‌ స్కాంలో ఫిబ్రవరి 26వ తేదీన మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈ కుంభకోణంలో నిందితుడిగా సిసోడియా పేరును ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చిన సీబీఐ.. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో రెండు ఫోన్లను నాశనం చేశారని ఆయన ఒప్పుకున్నట్లు ప్రస్తావించింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం ఆయనపై మనీల్యాండరింగ్‌ అభియోగాలు నమోదు చేసి ప్రశ్నించింది కూడా. అంతకు ముందు స్థానిక కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ సైతం తిరస్కరణకు గురైంది.

ఇదీ చదవండి: ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి!

మరిన్ని వార్తలు