వీడియో: ప్లీజ్‌ బాబా.. ఆ హంతకుడెవరో చెప్పరా? పోలీసాఫీసర్‌ ముందు ఓవరాక్షన్‌పై లుక్కేయండి

23 Aug, 2022 06:55 IST|Sakshi

భోపాల్‌: మర్డర్‌ మిస్టరీని ఛేదించాలంటే.. డాగ్‌స్క్వాడ్‌ తనిఖీలు, ఫోరెన్సిక్‌ రిపోర్టులు, విచారణలు ఇలా పోలీ­సులు మల్లగుల్లాలు పడతారు. కానీ.. చిత్రంలోని పోలీసేమో.. తనకు బాగా నమ్మకమున్న బాబా దగ్గరికి వెళ్లాడు.. ఓ హత్య కేసులోని అనుమానితుల జాబితాను ఆయన చేతిలో పెట్టి... మర్డర్‌ చేసిందెవరో చెప్పమని కోరాడు. 

ఈ బాబా కూడా జేమ్స్‌బాండ్‌ టైపులో లిస్టును ఒకటికి పదిసార్లు పరిశీలనగా చూసేసి.. ఇందులో ఉన్నవారెవరూ కాదు భక్తా.. మరొకడు ఉన్నాడు అంటూ కొంచెం బేస్‌ వాయిస్‌తో బదులిచ్చాడు. ఈ వీడియో కాస్త.. యూట్యూబ్‌లో వైరలయ్యింది. ఇంకేముంది ఉన్నతాధికారులు.. ఆ ఆఫీసర్‌ ఎవరా అని ఆరా తీశారు. చివరికి మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లా బమితా స్టేషన్‌ పరిధిలో పనిచేస్తున్న  ఏఎస్‌ఐ అనిల్‌ శర్మగా నిర్ధారణ అయ్యింది. వెంటనే.. సదరు ఏఎస్‌ఐని సస్పెండ్‌ చేశారు.
 
ఇంతకీ ఈ కేసు ఏమిటంటే.. జూలై 28న వొతపూర్వ గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువతి హత్యకు గురైంది. గ్రామంలోని ముగ్గు­రిని అనుమానిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు కేసు పెట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వారిని వదిలిపెట్టారు. చివరికి యువతి మామను అరెస్టు చేశారు. అయితే అతడిని పరిశోధన, సాక్ష్యాల అధారంగానే అరెస్టు చేశామని, బాబా సూచన మేరకు కాదని జిల్లా ఎస్పీ పేర్కొనడం గమనార్హం. 

మరిన్ని వార్తలు