త్వరలో విపక్షాల కీలక భేటీ!

23 May, 2023 04:58 IST|Sakshi

నేడో, రేపో ముహూర్తం ఖరారు

ఖర్గే, రాహుల్, నితీశ్‌ భేటీలో నిర్ణయం

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాల్లో కీలక ముందడుగుకు రంగం సిద్ధమవుతోంది. విపక్షాల ఉమ్మడి భేటీకి మూహూర్తాన్ని, వేదికను ఒకట్రెండు రోజుల్లో నిర్ణయించనున్నారు. సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌గాంధీలతో బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్‌ జరిపిన భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. విపక్షాల భేటీ పట్నాలోనే ఉండొచ్చని నెల క్రితం ఖర్గేతో భేటీ అనంతరం నితీశ్‌ పేర్కొనడం తెలిసిందే.

కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసిన నేపథ్యంలో ఐక్యతా యత్నాలను మరింత ముమ్మరం చేయాలని తాజా సమావేశంలో నేతలు నిర్ణయించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహరచన విపక్షాల భేటీలో ఏయే అంశాలను చర్చించాలనే దానిపై దాదాపు గంటకు పైగా చర్చించారు. ఖర్గే, రాహుల్, నితీశ్‌ సమావేశమవడం గత నెలన్నరలో ఇది రెండోసారి కావడం విశేషం. జేడీ(యూ) అధినేత లాలన్‌సింగ్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ కూడా ఇందులో పాల్గొన్నారు.

బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ అనారోగ్యంతో రాలేకపోయారని సమాచారం. ఇప్పుడిక దేశమంతా ఒక్కటవుతుందంటూ భేటీ అనంతరం ఖర్గే ట్వీట్‌ చేశారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మా సందేశం. దేశానికి నూతన దిశానిర్దేశం చేసే ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని నితీశ్‌తో భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చాం’’ అని పేర్కొన్నారు. అతి త్వరలో విపక్షాలన్నీ భేటీ కావాలని నిర్ణయించినట్టు వేణుగోపాల్, లాలన్‌సింగ్‌ మీడియాకు తెలిపారు. విపక్షాల అధినేతలంతా అందులో పాల్గొటారని చెప్పారు.

కొన్నాళ్లుగా వరుస భేటీలు
నితీశ్‌ కొద్ది రోజులుగా విపక్ష నేతలందరినీ వరుసబెట్టి కలుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం కూడా ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తో నితీశ్‌ మరోసారి సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఢిల్లీ ప్రభుత్వాధికారులపై అజమాయిషీ విషయమై కేంద్రంతో జరుపుతున్న పోరాటంలో ఆప్‌ సర్కారుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని హామీ ఇచ్చారు.

శనివారం కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమంలో కూడా జాతీయ స్థాయిలో విపక్ష నేతలంతా వేదికపైకి వచ్చి సమైక్యతా సందేశమివ్వడం తెలిసిందే. నితీశ్‌తో పాటు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, తమిళనాడు సీఎం స్టాలిన్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు వీరిలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కూడా విపక్ష కూటమిలోకి తీసుకొచ్చేందుకు నితీశ్‌ ప్రయత్నిస్తున్నారు.

ఇవే కీలకం!
ప్రధాని మోదీకి దీటుగా విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని తమ సారథిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. అయితే పోటీదారులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనిపై ఏకాభిప్రాయం ఎలా కుదుదరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అంతేగాక లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తమకు వీలైనన్ని ఎక్కువ స్థానాలు కేటాయించాలని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేస్తున్నాయి. అవి కోరినట్టుగా తాను 200 సీట్లలోనే పోటీకి పరిమితమయ్యేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా లేదు. బలమైన విపక్ష కూటమి ఏర్పాటై లోక్‌సభ ఎన్నికల బరిలో బీజేపీని దీటుగా ఎదుర్కోవాలంటే దీనిపైనా వీలైనంత త్వరగా స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు