Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది

14 Aug, 2022 04:45 IST|Sakshi
బెంగళూరు విధాన సౌధ ముందు జరిగిన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సంబరాలు

హర్‌ ఘర్‌ తిరంగా ప్రారంభం

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ

న్యూఢిల్లీ: దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రతీ ఇంటిపై జాతీయ జెండా సమున్నతంగా ఎగరాలన్న ఉద్దేశంతో 13వ తేదీ నుంచి 15 వరకు ప్రతీ ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాని ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునిచ్చింది.

ఈ పిలుపునందుకొని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతో ఉత్సాహంగా జాతీయ జెండాని ఆవిష్కృతం చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్‌ పిక్చర్స్‌ కింద జాతీయ జెండా ఇమేజ్‌లను ఉంచుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తన సతీమణితో కలిసి ఢిల్లీలోని తన నివాసంపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం మంత్రులు నేతలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘జాతీయ జెండా మనకి గర్వకారణం. భారతీయులందరినీ సమైక్యంగా ఉంచుతూ స్ఫూర్తి నింపుతుంది. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగధనుల్ని అందరం స్మరించుకుందాం’’ అని షా ట్వీట్‌ చేశారు.

గత పది రోజుల్లోనే పోస్టాఫీసుల ద్వారా ఒక కోటి జాతీయ జెండాలను విక్రయించినట్టుగా పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఇక గ్రామాలు, పట్టణాల్లోనూ జాతీయ జెండాకు సేల్స్‌ విపరీతంగా పెరిగాయి. ఢిల్లీలోని కేజ్రివాల్‌ ప్రభుత్వం 25 లక్షల జెండాలను విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. గుజరాత్‌లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ విద్యార్థులకు జెండాలు పంచారు.

ప్రొఫైల్‌ పిక్చర్‌ని మార్చిన ఆరెస్సెస్‌
ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) సామాజిక మాధ్యమాల్లో తన అకౌంట్లలో ప్రొఫైల్‌ పిక్చర్‌లో జాతీయ జెండాను ఉంచింది. ఆజాదీ కా అమృతోత్సవ్‌ వేడుకల్లో భాగంగా అందరూ జాతీయ జెండాలను ప్రొఫైల్‌ పిక్‌లుగా ఆగస్టు 2 నుంచి 15వరకు జాతీయ జెండాని ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చినప్పటికీ ఆరెస్సెస్‌ ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. కాషాయ రంగు జెండానే ఉంచింది. దీంతో ఆరెస్సెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.   హర్‌ ఘర్‌ కా తిరంగా కార్యక్రమంతో ఆర్సెసెస్‌ తన ప్రొఫైల్‌ పిక్‌లో జాతీయ జెండాను ఉంచింది. 

మరిన్ని వార్తలు