తొలిసారి భేటీ కానున్న మోదీ-బైడెన్‌

5 Mar, 2021 17:40 IST|Sakshi

క్వాడ్‌ సమావేశంలో వర్చువల్‌గా కలవనున్న నేతలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ తొలిసారి.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అయితే వర్చువల్‌గా. త్వరలో ఆస్ట్రేలియా నిర్వ‌హించ‌నున్న క్వాడ్ స‌మావేశంలో ఆ ఇద్ద‌రు నేత‌ల భేటీ దాదాపు ఖరారైంది. క్వాడ్‌లోని స‌భ్య‌దేశాలైన అమెరికా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా, ఇండియా త్వ‌ర‌లో భేటీ కానున్న‌ట్లు ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మోరిస‌న్ శుక్రవారం ప్ర‌క‌టించారు. చైనా ఆధిప‌త్యాన్ని ఢీకొట్టేందుకు క్వాడ్ గ్రూపును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్టవేసేందుకు అగ్ర నేతలు ఈ భేటీలో ఏం చర్చించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

ఇటీవ‌ల చైనాతో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు క‌య్యానికి దిగడం, ప‌లు ద్వైపాక్షిక‌, వాణిజ్య అంశాల్లో చైనాతో ఆ రెండు దేశాలకు తీవ్రస్థాయిలో విభేదాలు రావడం తెలిసిందే. ఇటీవ‌ల స‌రిహ‌ద్దు అంశంలో భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జరగబోయే క్వాడ్‌ భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతం శాంతి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం ఈ నాలుగు దేశాల అధ్యక్షులు నిర్మాణాత్మకంగా కలిసి పని చేస్తారు అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యాక్షురాలితో కొన్ని వారాల క్రితమే చర్చించానన్నారు మోరిసన్‌. 

జో బైడెన్‌ అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ ఆయనకు గత నెల 8న ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇరు దేశాధ్యక్షులు తొలిసారిగా త్వరలో జరగబోయే క్వాడ్‌ సమావేశంలోనే కలవనున్నారు. ఇరు దేశాధినేతల మధ్య వ‌ర్చువ‌ల్ భేటీ జరగడం మాత్రం ఇదే తొలిసారి. క్వాడ్ మీటింగ్‌కు సంబంధించి భారత ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువడనప్పటికి స‌ద‌స్సుకు మోదీ, బైడెన్ హాజ‌రు అవుతార‌ని ఆసీస్ పేర్కొంది. ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో శాంతి, ర‌క్ష‌ణ కోసం నాలుగు దేశాలు ప‌నిచేయ‌నున్న‌ట్లు స్కాట్ తెలిపారు.

చదవండి:
చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధం: బైడెన్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు