అమృత్‌ మహోత్సవ్‌లో భాగస్వాములు కండి

11 Mar, 2021 04:13 IST|Sakshi
భేటీ అనంతరం వెళుతున్న ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ చీఫ్‌ నడ్డా

ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో పార్లమెంట్‌ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు విరివిగా పాల్గొ నాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రారంభం కానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మీడియాకు తెలిపారు. దాదాపు ఏడాది తర్వాత బుధవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా ఉన్న 75 ప్రాంతాల్లో 75 వారాలపాటు జరిగే ఈ పండగలో పార్లమెంట్‌ సభ్యులంతా పాల్గొని, ప్రభుత్వం చేపట్టిన కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌లో పాల్గొనేలా ప్రజలకు చేయూత అందించాలని కూడా సూచించారని ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. వ్యాక్సినేషన్‌కు వెళ్లే పౌరులకు వాహనాలు సమ కూర్చడం వంటి ఏర్పాట్లు చేయాలని కోరార న్నారు. కోవిడ్‌ మహమ్మారిని అదుపు చేయడంలో ప్రధాని మోదీ సమర్థంగా వ్యవహరించారని ప్రశంసిస్తూ పార్లమెంటరీ పార్టీ ఒక తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. ఈ భేటీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రసంగించారని చెప్పారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌పై మోదీ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేయాలనుకున్నారని, అయితే, సభలో అంతరాయాల వల్ల ఆయన మాట్లాడ లేకపోయారని మంత్రి జోషి తెలిపారు. అంతకు ముందు, సభలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే విషయంలో ఏకాభి ప్రాయం సాధించేందుకు స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం విఫలమైంది. మిగతా పార్టీలన్నీ అంగీకరించినా ఆందోళనలను విరమించేందుకు కాంగ్రెస ససేమిరా అంది.

మరిన్ని వార్తలు