చుట్టేస్తోంది.. జాగ్రత్త: ప్రధాని మోదీ

14 Jan, 2022 09:19 IST|Sakshi

స్థానిక కంటైన్‌మెంట్‌కు ప్రాధాన్యతనివ్వండి 

ముఖ్యమంత్రులతో కోవిడ్‌పై సమీక్షలో ప్రధాని మోదీ  

న్యూఢిల్లీ: అనూహ్య వేగంతో సోకుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో దేశం మరింత అప్రమత్తతో ముందుకెళ్లాలని ప్రధాని మోదీ మరోమారు హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజారోగ్య వ్యవస్థల సంసిద్ధత, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై అత్యున్నతస్థాయి సమీక్షలో భాగంగా ప్రధాని మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. గత 236 రోజుల్లో ఎన్నడూలేని గరిష్ట స్థాయిలో 2,47,417 కొత్త కేసులు నమోదైన రోజే ప్రధాని నేతృత్వంలో ఈ వర్చువల్‌ భేటీ జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

జిల్లా స్థాయిలో మౌలిక వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, యుద్ధప్రాతిపదికన కోవిడ్‌ టీకా కార్యక్రమాన్ని కొనసాగించాలని మోదీ సూచించారు. ప్రతీ రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులను నేరుగా తెల్సుకునేందుకు, ఆయా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న ఆదర్శవంతమైన వైద్య విధానాలపై అవగాహన పెంచుకునేందుకే సీఎంలతో భేటీ నిర్వహించినట్లు ప్రధాని చెప్పారు.  సీఎంలతో భేటీలో ప్రధాని చేసిన హెచ్చరికలు, ఇచ్చిన సూచనలు ఆయన మాటల్లో..

వేగంగా విస్తరిస్తోంది 
భయాలను నిజం చేస్తూ భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్కువ వేగంతో విస్తరిస్తోంది. గత వేరియెంట్ల కంటే కొన్నిరెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తిస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన కోవిడ్‌ ఆంక్షలు అమలుచేస్తూనే ఆ కఠిన చర్యలు.. దేశ ఆర్థికవ్యవస్థ, ప్రజల జీవనాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి. స్థానికంగా కంటైన్‌మెంట్‌పై దృష్టిపెట్టండి. కోవిడ్‌తో పోరాడుతున్న మనం.. భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి.  

భయపడాల్సిన పనిలేదు.. ఆయుధముంది 
ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్రమత్తత విషయంలో నిర్లక్ష్యం వద్దు. వేరియంట్‌ ఏదైనా సరే వాటిని ఎదుర్కొనేందుకు కోవిడ్‌ టీకాల రూపంలో మనకు సరైన ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని ఎందరో ప్రపంచ వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి. అమెరికాలో రోజుకు దాదాపు 14 లక్షల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ తరుణంలో మనం అన్నివేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే.   

నివారణ, సమిష్టి కార్యాచరణ 
మరింతగా కేసులు పెరగకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ నివారణ చర్యలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. స్థానికంగా కంటైన్‌మెంట్‌ ప్రణాళికకు పదునుపెట్టాలి. దేశంలో కోవిడ్‌ టీకాకు అర్హులైన జనాభాలో 92 శాతం మందికి తొలి డోస్‌ ఇవ్వడం పూర్తయింది. దాదాపు 70 శాతం మంది రెండో డోస్‌ సైతం తీసుకున్నారు. కేవలం 10 రోజుల్లోనే దాదాపు మూడు కోట్ల మంది టీనేజర్లకు టీకాలు ఇచ్చాం. 100 శాతం వ్యాక్సినేషన్‌ సాకారమయ్యేలా ఇంటింటికీ టీకా (హర్‌ ఘర్‌ దస్తక్‌) కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయాలి.  

మరిన్ని వార్తలు