మెహబూబా తల్లికి పాస్‌పోర్ట్‌ నిరాకరణ

31 Mar, 2021 07:27 IST|Sakshi

శ్రీనగర్‌: కేంద్ర మాజీ మంత్రి, కశ్మీర్‌ మాజీ సీఎం ముఫ్తి మొహమ్మద్‌ సయీద్‌ భార్య గుల్షన్‌ నజీర్‌ పాస్‌పోర్టు దరఖాస్తు తిరస్కరణకు గురైంది. పోలీస్‌ శాఖ ఇచ్చిన ప్రతికూల నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్షన్‌ కూతురు, కశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా తన పాస్‌పోర్టు దరఖాస్తును అధికారులు తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించగా సోమవారం చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ తల్లి, కూతురు పవిత్ర మక్కా వెళ్లేందుకు పాస్‌పోర్ట్‌ కోసం గత ఏడాది డిసెంబర్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పాస్‌పోర్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 6(2)(సి) ప్రకారం జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ సీఐడీ విభాగం పాస్‌పోర్ట్‌ దరఖాస్తును తిరస్కరించిందని ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి కార్యాలయం గుల్షన్‌కు లేఖ పంపింది.

ఈ విషయాన్ని మెహబూబా ముఫ్తీ కూడా ట్విట్టర్‌ ద్వారా ధ్రువీకరించారు. ‘ఏడు పదుల వయస్సున్న నా తల్లితో దేశ భద్రతకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి, ఆమెకు పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. వారి మాట విన లేదని భారత ప్రభుత్వం మమ్మల్ని ఇలాంటి విధానాలతో వేధించేందుకు, శిక్షించేందుకు పూనుకుంది’అని విమర్శించారు. ఎవరైనా దరఖాస్తుదారు దేశం విడిచి వెళ్లడం ద్వారా దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావించినప్పుడు అధికారులు పాస్‌పోర్ట్‌ను నిరాకరించేందుకు పాస్‌పోర్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 6(2)(సి) సెక్షన్‌ అధికారం కల్పించింది. దరఖాస్తుదారుకు పాస్‌పోర్ట్‌ మంజూరు ప్రజాసంక్షేమం కోసం కాదని కేంద్రం భావించిన సందర్భాల్లో కూడా అనుమతి నిరాకరించవచ్చు.
చదవండి: మాస్క్‌ సరిగా ధరించకుంటే ఫైన్‌

మరిన్ని వార్తలు